పీలేరుపై పెద్దిరెడ్డి పట్టు

3 Apr, 2014 02:54 IST|Sakshi
పీలేరుపై పెద్దిరెడ్డి పట్టు
  •     నామమాత్రపు పోటీలో టీడీపీ
  •      పెద్దిరెడ్డి రాకతో భారీగా వలసలు
  •      పల్లెల్లో పెద్దిరెడ్డికి అపూర్వ స్వాగతం
  •      వైఎస్సార్ కాంగ్రెస్‌లో రెట్టింపు ఉత్సాహం
  •  పీలేరు, న్యూస్‌లైన్ : మాజీ సీఎం కిరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభంజనం వీస్తోంది. మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సమైక్యాంధ్ర మద్దతు అభ్యర్థులతోపాటు టీడీపీ పోటీ నామమాత్రమైంది. సమైక్యాధ్ర మద్దతు అభ్యర్థులు మొదట్లో కొన్ని ఆశలు పెట్టుకున్నప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనతో ఎన్నికలు ఏకపక్షమయ్యాయని చెప్పుకోవాలి.

    ఈ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభావం అంతంతమాత్రంగానే ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి నాయకత్వ లోపంతో ఎవరికి వారే యమునాతీరే అన్నచందంగా మారింది. ఎన్నిల ప్రచార పర్వం ప్రారంభమైనప్పటి నుంచి పీలేరు నియోజకవర్గంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు రాజంపేట పార్లమెంట్ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో అటు సమైక్యాంధ్ర, ఇటు టీడీపీకి చెందిన ప్రముఖ నేతలు పెద్ద సంఖ్యలోవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు.

    మూడు దశాబ్దాలుగా పీలేరు నియోజకవర్గ ప్రజలతో పెద్దిరెడ్డి కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. మరోవైపు ప్రతి గ్రామంలోనూ పార్టీ నాయకులతో పాటు ప్రజలను, అభిమానులను పేరు పెట్టి పిలిచేంతగా పెద్దిరెడ్డికి చనువు ఉంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు మండలంలో బాలంవారిపల్లె, దొడ్డిపల్లె, అగ్రహారం, వేపులబైలు, మేళ్లచెరువు, గూడరేవుపల్లె, ముడుపులవేముల, పీలేరు పట్టణంలోని పలు ఎంపీటీసీల  పరిధిలో విస్తృతంగా పర్యటించారు.

    ఈ సందర్భంగా పలువురు నాయకులు తమ అనుచరులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిచయం ఉన్న నేతలందరూ తమ భవిష్యత్తు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోనే ముడిపడి ఉందన్న నమ్మకంతో ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారు. ఇక సమైక్యాంధ్ర, టీడీపీలు గల్లంతుకావడం తథ్యమని ముందుగానే పసిగట్టిన నేతలు పక్కా ప్రణాళికతో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్నారు.

    నిన్నటి వరకు సీఎంగా కొనసాగిన కిరణ్‌కుమార్‌రెడ్డి అనుచరులు సైతం పోటాపోటీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు మిథున్‌రెడ్డి సైతం పీలేరు నియోజకవర్గంలోని పీలేరు, కేవీ పల్లె, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మాజీ సీఎం ఇలాకాలో అన్ని మండలాల్లోనూ వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఎగురవేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నారు.
     

మరిన్ని వార్తలు