మింగ మాత్రలేదు

25 Jan, 2015 01:02 IST|Sakshi

సాక్షి, గుంటూరు : ఉచిత వైద్యం అందుతుందనే ఆశతో ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయించే రోగులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి నెలకొంది. స్వైన్ ఫ్లూ, కంఠసర్పి వంటి ప్రాణాంతక వ్యాధులకు సైతం మందులు సరఫరా చేయలేక వైద్య ఆరోగ్యశాఖ చేతులెత్తేస్తోంది. ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లే స్తోమత లేక, బహిరంగ మార్కెట్‌లో మందులు కొనలేక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు.
 
ఇటీవల హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ కేసులు అధికంగా నమోదు కావటం, జిల్లాలో ఓ మహిళ, పొరుగున ప్రకాశం జిల్లాలో మరో యువకుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో మృతిచెందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాధిపట్ల జిల్లా వాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లా మహిళ స్వైన్‌ఫ్లూతో చనిపోలేదని అధికారులు నిర్ధారించినప్పటికీ ప్రజల్లో భయం మాత్రం పోలేదు.

ఈ వ్యాధి లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రిలో చేరితే  ముందుగా చికిత్స చేసే వైద్య సిబ్బందికి టామిఫ్లూ వ్యాక్సిన్‌ను వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గుంటూరు జ్వరాల ఆసుపత్రిలో ఉన్న కొద్దిపాటి వ్యాక్సిన్ సిబ్బందికే సరిపోయే పరిస్థితి లేదు. ఇంక రోగులకు వేయడానికి వ్యాక్సిన్ ఎక్కడి నుంచి తేవాలో అధికారులకే తెలియాలి. ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే సరఫరా చేయాలని బహిరంగ మార్కెట్‌లో అమ్మకూడదన్న నింబధనలతో మరింత ఇబ్బందిగా మారింది.
 
కంఠసర్పి నివారణా మందులూ లేవు..
చిన్న పిల్లల్లో అధికంగా వచ్చే ప్రాణాంతక కంఠసర్పి వ్యాధికి కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు లేవు. ఈ వ్యాధి సోకిన పిల్లలకు బరువు ఆధారంగా ఆరు నుంచి ఎనిమిది డోస్‌లు యాంటి డిఫ్తీరియల్ సీరమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఒక్కో డోస్ విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.10వేల వరకు ఉంది.

అంత ఖరీదైన మందులు కొనుగోలు చేసే శక్తి లేకపోవడం పేద ప్రజలకు సమస్యగా మారింది. పిచ్చికుక్క కరిచినప్పుడు బ్రేక్-3 బైట్స్‌కు ఇమ్మినో గ్లోబిన్ వ్యాక్సిన్‌ను ఏడు నుంచి ఎనిమిది డోసులు వాడాల్సి ఉంటుంది. ఖరీదైన ఈ మందు కూడా ప్రభుత్వాస్పత్రుల్లో   కొరతగానే ఉంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత తీర్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు