‘గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి’

2 Aug, 2019 13:41 IST|Sakshi

సాక్షి, కాకినాడ : రాష్ట్రంలోని పాలనా వ్యవస్థల్లో మార్పు తీసుకువచ్చేందుకు.. ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాల్‌లో గ్రామ వలంటీర్ల మాస్టర్‌ ట్రైనర్స్‌ శిక్షణ కార్యక్రమనికి శుక్రవారం ఆయన హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ వలంటీర్లు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. ‘మీ పనితీరు ప్రభుత్వానికి అద్దం పట్టేలా ఉండాలి. వలంటీర్లు తప్పు చేస్తే వెంటనే వారిని తొలగించి కొత్త వారిని నియమిస్తాం’ అని స్పష్టం చేశారు.

అదే విధంగా గత ప్రభుత్వ జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా.. గ్రామ వలంటీర్ వ్యవస్థ అందుకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కాగా వలంటీర్‌ వ్యవస్థ నియంత్రణ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దే ఉంటుందని వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి  వచ్చిన తర్వాత ఒకేసారి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని మంత్రి తెలిపారు. అన్న క్యాంటిన్లు తొలగించలేదని, బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తున్నామన్నారు. దీంతో పాటు గోదావరి వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు