‘విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేయండి’

9 Jan, 2020 15:31 IST|Sakshi

సాక్షి, కాకినాడ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కులమత,పార్టీలు చూడకుండా ఫీజు రీయింబర్స్‌మంట్‌ అమలు చేస్తే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు అడుగులు ముందుకేసి అమ్మఒడి ప్రవేశపెట్టారని ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక కుటుంబ పోషణ కోసం పిల్లలను పాఠశాలలకు పంపకుండా పనులకు పంపుతున్న తల్లిదండ్రుల కోసమే ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. కాకినాడలో గురువారం ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి కురసాల కన్నబాబు పాల్గొన్నారు.

గురువును గౌరవించనివాడు పైకి రాడు
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ‘అమ్మ ఒడి పథకం అమలు ఓ సాహసోపేత నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకం అమల్లో లేదు. ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుంది. పేదరికానికి చదువు అడ్డు కాదు. రంగురంగుల బట్టలు, బిల్డింగ్‌లు చూసి ప్రైవేటు స్కూల్‌ల మోజులో పడకండి. పిల్లలు చదువుకునే సమయంలో టీవీలు చూడమని తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేసుకోండి. ‘అమ్మ ఒడి’ పథకంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రధానమైంది. సమాజ స్థితిగతులను మార్చే శక్తి ఉపాధ్యాయులకే ఉంది. గురువును గౌరవించని వ్యక్తి జీవితంలో పైకి రాడు. ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా విద్యార్థులకు అవసరమైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ డెవలప్‌ చేయకపోతే మనం లక్ష్యాన్ని సాధించలేము’ అని పేర్కొన్నారు.

అధిక లబ్ధి తూర్పు గోదావరికే
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. ‘అమ్మఒడి పథకం ఒక చరిత్ర. సీఎం జగన్‌ సంకల్పం వృథా కాకూడదు. అమ్మ ఒడి డబ్బులతో మీ పిల్లలను శ్రద్ధగా చదివించండి. 43 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులకు అమ్మ ఒడి పథకం అందుతుంది. రాష్ట్రంలో అమ్మఒడి ద్వారా అత్యధికంగా లబ్ధిపొందే జిల్లా తూర్పు గోదావరి. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే రూ. 685 కోట్లు లబ్ధిదారులకు అందుతాయి. పాదయాత్రలో బడుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్‌ వారి కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల లోపు కిడ్నీ బాధితుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు సీఎం అందరినీ ఆదుకున్నార’ని తెలిపారు.

చదవండి: వాటే విజన్ బాబ్జీ!: విజయసాయి రెడ్డి

‘అమ్మఒడి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

మరిన్ని వార్తలు