సబ్‌ రిజిస్ట్రార్‌ను ఇరికించబోయి దొరికిపోయిన ‘ఏసీబీ’

30 Oct, 2019 07:41 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో సొమ్ము పెట్టి సీసీ కెమెరాలకు చిక్కిన ఏసీబీ అధికారులు

చర్యలకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్, ఆ కార్యాలయ ఉద్యోగులను అవినీతి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారం ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ దృష్టికి వెళ్లడంతో.. తీవ్రంగా స్పందించిన ఆయన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. ఈ వ్యవహారం రిజిస్ట్రేషన్, అవినీతి నిరోధక శాఖల్లో కలకలం రేపింది. 

అసలేం జరిగిందంటే.. 
ఈ నెల 9న మధ్యాహ్నం మధురవాడ సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయానికి ఏసీబీ బృందం వెళ్లింది. ఆ సమయంలో పర్మిషన్‌పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ టి.తారకేష్‌ను ఏసీబీ సీఐ గఫూర్‌ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్‌ బయటకు వెళ్లి రూ.61,500 నగదును తీసుకొచ్చి రికార్డు రూమ్‌లోని రికార్డులో పెట్టి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఏసీబీ తీసుకొచ్చిన మధ్యవర్తులు తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించడంతో కేసు పెట్టడం వీలు కాలేదు. ఏసీబీ సీఐ బయట నుంచి డబ్బు తెచ్చి రికార్డుల్లో పెట్టినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ సొమ్ముతో లంచం తీసుకున్నట్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బందిని బెదిరించేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. 

ఇందుకోసం విచారణల పేరుతో వేధించారు. అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీపై ఒత్తిడి తెచ్చి సబ్‌ రిజిస్ట్రార్‌ తారకేష్‌ను మధురవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బదిలీ చేయించారు. ఆ తరువాత తారకేష్‌ను డీఐజీ యథాస్థానానికి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్‌ సీసీ కెమెరాలోని ఫుటేజిని సాక్ష్యాలుగా తీసుకుని మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను కలిశారు. సీసీ ఫుటేజిని వీక్షించిన ఉప ముఖ్యమంత్రి తప్పు చేసిన ఏసీబీ అధికారులపై విచారణ జరిపించి.. డీఎస్పీ రంగరాజు, సీఐ గఫూర్, కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు లేఖ రాశారు. సీసీ ఫుటేజి సాక్ష్యాలను, సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదును ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌కు పంపించారు. ఏసీబీ అధికారుల ఒత్తిడికి తలొగ్గి సబ్‌ రిజిస్ట్రార్‌ను బదిలీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ విశాఖపట్నం డీఐజీని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా