ఆంధ్రజ్యోతి కథనాలపై సర్కారు సీరియస్‌

4 Oct, 2019 17:41 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నామని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఏపీటీఎస్‌ టెండర్లు ఖరారయ్యాయని తెలిపారు. అదే విధంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని... చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

శుక్రవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ... భూ రికార్డుల సర్వే టెండర్ల ఖరారు విషయంలో ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. అధికారులు కష్టపడి పని చేస్తుంటే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఈ సందర్భంగా భూముల రీ-సర్వేకు సంబంధించిన టెండర్ల ఫైళ్లను సుభాష్‌ చంద్రబోస్‌ మీడియా ముందు ఉంచారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా 3.31 కోట్ల ఎకరాల భూమి ఉంది. రీ సర్వే చేస్తున్నాం. టెండర్ల ఫైలును మీ ముందు పెడుతున్నాం... అంతా పరిశీలించుకోవచ్చు. బహుశా ఫైళ్లను మీడియా ముందు పెట్టడం ఇదే తొలిసారి అనుకుంటా’ అని ఆయన పేర్కొన్నారు.

సమాచారం సేకరిస్తున్నాం
‘పేదలకు.. వివిధ వర్గాల వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా సబ్ కమిటీ వేశాం. వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలతో సమావేశమయ్యాం. గత ప్రభుత్వం కొందరు ఐఏఎస్‌లకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా.. ఇంకొందరికి ఇవ్వాల్సి ఉంది. అలాగే ఎంత మంది ఉద్యోగులకూ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే విషయంపై అంచనా వేయాలని సంబంధిత అధికారులను కోరాం. అలాగే అర్చకులు, ఇమామ్‌లు, ఫాస్టర్లు, హైకోర్టు అడ్వకేట్లు, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఈ వర్గాలకు సంబంధించి ఎంత మంది అర్హులు ఉంటారన్న వివరాలను అధికారులను అడుగుతున్నాం’ అని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు