హోదా కోసం పోరాడటమే నేరమా?

3 Dec, 2016 01:20 IST|Sakshi

- ప్రివిలేజ్ కమిటీ ఎదుట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాదన
- అసెంబ్లీలో సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ
 
 సాక్షి, అమరావతి/హైదరాబాద్: భావితరాల భవిష్యత్ కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చే క్రమంలో సభలో చర్చ జరపాలని కోరుతూ తాము సభా కార్యక్రమాలను స్తంభింపచేశాం తప్ప మరో ఆలోచన లేదని గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (వైఎస్సార్‌సీపీ) చెప్పారు. హోదా కోసం పోరాడటమే నేరమా అని ప్రశ్నించారు. తాను సమగ్రంగా వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని అసెంబ్లీ హాల్‌లో జరిగింది. చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (వైఎస్సార్‌సీపీ), తెనాలి శ్రావణ్‌కుమార్, కె.రామకృష్ణ (టీడీపీ) హాజరయ్యారు.

 సొంత ఎజెండా లేదు..: అనంతరం అసెంబ్లీ ఆవరణలో రామకృష్ణారెడ్డి మీడియా తో మాట్లాడుతూ శాసనసభలో జరిగిన పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పిలిచిన ప్రివిలేజ్ కమిటీ ప్రోసీడింగ్ ఇవ్వకుండా హాజరు కావాలనడం బాధాకరమన్నారు. తనకు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకూ జరిగిన శాసనసభ సమావేశాల వీడియో టేప్‌లను అందిస్తే వాటిని పరిశీలించి సభలో తమను మాట్లాడనివ్వకుండా అధికారపక్షం ఎలా అడ్డుకుందో.. వచ్చే సమావేశంలో వివరిస్తారని చెప్పారు.

 నాని, చెవిరెడ్డి లేఖలు..: కమిటీ ముందు హాజరు కావాల్సిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) జ్వరం వల్ల రాలేకపోతున్నానని, స్థానికంగా అమ్మవారి ఆలయంలో వస్త్రాలు సమర్పించాల్సి ఉన్నందున రాలేనని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లేఖ పంపారు. దీంతో మరోసారి వారు హాజరై వివరణ ఇచ్చేందుకు కమిటీ అనుమతిచ్చింది. కాగా అసెంబ్లీలో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తినప్పుడు తమను ఉద్దేశించి అమర్యాదగా మాట్లాడి, అసభ్యంగా వ్యవహరించిన అధికార పార్టీ నేతలకు సభాహక్కుల ఉల్లంఘణ నోటీసులు ఇవ్వాలంటూ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోడెల శివప్రసాద్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన తాజాగా స్పీకర్‌కు ఒక లేఖ రాశారు.

మరిన్ని వార్తలు