కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారు : పిన్నెల్లి

11 Mar, 2020 14:13 IST|Sakshi

సాక్షి, గుంటూరు(మాచర్ల): పల్నాడులో ప్రశాంత పరిస్థితులను చెడగొట్టేందుకు టీడీపీ యత్నిస్తోందని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విజయవాడ నుంచి 10 కార్లలో టీడీపీ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్నతో పాటు మరికొందరు గూండాలను చంద్రబాబు పంపించారన్నారు. ఆయన బుధవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ.. మాచర్లలో దూసుకొచ్చిన టీడీపీ వాహనాల్లో ఒకటి ఓ పిల్లాడికి తగిలిందని, దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారని తెలిపారు. వారిని సముదాయించాల్సింది పోయి బోండా సహా ఇతర టీడీపీ నాయకులు దుర్భాషలాడారని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలన్నదే టీడీపీ పథకమని, అందులో భాగంగానే  పది కార్లలో వచ్చి కావాలనే గొడవకు దిగారని తెలిపారు.

ప్రజాబలం లేని చంద్రబాబు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, ఆ ఘటనలను తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అన్నారు. ఇదే పల్నాడులో 2014 స్థానిక ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు, ముస్తాఫాలపై దాడులు చేసి చంపడానికి యత్నించారని గుర్తు చేశారు. మొన్నటికి మొన్న రైతుల ముసుగులో తనను హత్య చేయడానికి ప్రయత్నించారని, అయినా తాము సంయమనంతో వ్యవహరించామని తెలిపారు.

మరిన్ని వార్తలు