పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి

4 May, 2015 01:37 IST|Sakshi
పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి

 పిస్తోలు మిస్‌ఫైర్: హెడ్ కానిస్టేబుల్ మృతి

విశాఖపట్నం: పిస్తోలు చెక్ చేసే ప్రయత్నంలో మిస్‌ఫైర్ కావడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఒకరు మృతి చెందగా మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. విశాఖ రైల్వే డివిజనల్ కార్యాలయం వెనుక భాగాన ఆయుధాలను భద్రపరిచే గదిలో  ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. రైల్వే డీజిల్ లోకోషెడ్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి విశాఖ వచ్చిన  రైల్వే బోర్డు సభ్యుడు (మెకానికల్) హేమంత్‌కుమార్ ఆదివారం ఉదయం అరకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఆయనకు ఎస్కార్ట్‌గా వెళ్లాల్సిన బృందంలోని వారికి కేటాయించిన 9 ఎమ్‌ఎమ్ పిస్తోలును అక్కడి సిబ్బంది అందజేశారు.

ఇలా కానిస్టేబుల్ కె.సి.ప్రధాని తన పిస్తోలును చెక్ చేస్తుండగా మిస్‌ఫైర్ అయింది. పక్కనే ఉన్న  హెచ్.సి. ధర్మాన ముసలయ్య (48) ఛాతీలోకి బుల్లెట్ దిగబడి, ముందుకు దూసుకుపోయి పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ ఎస్.మల్లికార్జునరావు ఛాతీ వెనుక భాగాన దిగబడింది. వీరిని పక్కనే ఉన్న రైల్వే ఆస్పత్రికి తరలిస్తుండగా  ముసలయ్య మృతి చెందాడు. మల్లికార్జునరావుకు   శస్త్రచికిత్స చేసి బుల్లెట్‌ను తొలగించారు. రైల్వే పోలీసులు, టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.     
 
 

మరిన్ని వార్తలు