ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం

24 Dec, 2013 01:32 IST|Sakshi
ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం

రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన చర్చిలలో ఒకటైన ఫిరంగిపురం చర్చి ఆంధ్రా రోమ్‌గా భాసిల్లుతోంది. అద్భుతమైన ఆర్కిటెక్ట్, ఇంజినీరింగ్ ప్రమాణాలతో ఎటువంటి ఆధారం లేకుండా నిర్మించిన టూంబ్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంగణంలో ఉన్న బాల ఏసుదేవాలయం రాష్ట్రంలో అతి పెద్ద రెండవ ఎత్తై క్రైస్తవ దేవాలయం. ఈ గ్రామానికి చెందిన సుమారు 200 మంది ఫాదర్లుగా, మఠకన్యలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారంటే క్రైస్తవ్యానికి సంబంధించి ఈ గ్రామ ప్రాధాన్యమేమిటో అర్ధమవుతుంది.  సుమారు రూ.45 లక్షలతో సుమారు 81 అడుగుల ఎత్తులో ఈ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన ఫాదర్ తియోడర్ డిక్మన్ మెమోరియల్ బెల్ టవర్‌ను ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రారంభించనున్నారు.
 - న్యూస్‌లైన్, ఫిరంగిపురం
 
 ల్లా మొత్తం మీద క్రెస్త్తవులు ఎక్కువగా నివసించే గ్రామంగా ఫిరంగిపురం పేరొందింది. గ్రామంలో క్రైస్తవ సంఘం 18వ శతాబ్దంలోనే వెలసినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పటినుంచి ఈనాటి వరకు విదేశీ, స్వదేశీ గురువులు ఎంతో మంది ఇక్కడ  క్రైస్తవ సంఘాలను ప్రోత్సహిస్తూ ఫిరంగిపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అభివృద్థి పరిచారు. కొంతకాలం ఫ్రెంచ్ గురువులు మత బోధనలు చేసి విద్యా, వైద్య సౌకర్యాలను ప్రజలకు అందించారు. 1846 నాటికే ఫిరంగిపుర క్రైస్తవ విచారణ కింద 16 గ్రామాలు ఉన్నాయి. లండన్ మిల్ హిల్ సభకు చెందిన మత గురువులు తియోడర్ డిక్మన్ స్వామి 1875లో ఫిరంగిపురం మత గురువులుగా వచ్చి బాలయేసు దేవాలయం శిథిలావస్థలో ఉండడం చూసి చలించిపోయారు. బాలఏసు  కెథెడ్రెల్ దేవాలయానికి పునాదులు వేసి అహోరాత్రులు శ్రమించి 1891 నాటికి దేవాలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దేవాలయ నిర్మాణ సమయంలో చర్చి పీఠ పైభాగంలో పెద్ద టూంబ్ ఉంటుంది. ఇది ఎటువంటి దూలం గానీ, మరే ఇతర ఆధారం గాని లేకుండా నిర్మించడం ఇక్కడి విశిష్టత. దేవాలయ శిల్పచాతుర్యం ఎంతో రమణీయంగా ఉంటుంది. రాష్ట్రంలో అతి పెద్ద రెండవ ఎత్తై ప్రముఖ దేవాలయంగా ఈ బాలఏసు దేవాలయం పేరొందింది.
 
 1891లో  ఫాదర్ డిక్మన్ దైవసేవకునిగానే ఉంటూ కొండపై కార్మెల్‌మాత దేవాలయాన్ని, పునీత అన్నమ్మ మఠాన్ని స్థాపించి 1915 జూలై 4న చనిపోయారు. అనంతరం విచారణ గురువులుగా వచ్చిన మత గురువులు మత వ్యాప్తితో పాటు గ్రామాభివృద్ధి, విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఫిరంగిపురంలో ఏటా జరిగే క్రిస్మస్ వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివస్తారు.  ఈ వేడుకలు డిసెంబర్ 24, 25,26 తేదీల్లో జరుగుతుంటాయి. ఇక్కడ పనిచేసిన గురువులు తమ త్యాగబుద్ధితో, నిరాడంబర జీవితంతో ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకొని ఇక్కడి ప్రజలను క్రైస్తవ్యం వైపు మరల్చారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది ఫాదర్లుగా, మఠకన్యలుగా వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్నారంటే ఈ గ్రామ విశిష్టతను అర్ధం చేసుకోవచ్చు. ఆనాడు తుపాను వచ్చి వందల గృహాలు పూర్తిగా పాడైతే అప్పటి గురువు బోనాల స్వామి ఈ ప్రాంత ప్రజలను ఆదుకున్నారు. దీంతో అప్పటి జిల్లా కలెక్టర్ ఆ గురువుకు బీదలతండ్రి అనే బిరుదు ఇచ్చాడు. మొట్టమొదట పోర్చుగ్రీసు వారు ఈ గ్రామానికి రావడంతో పరంగీలు ఉండే పురంగా వాడుకలో ఫిరంగిపురంగా మారింది. ఇక్కడి మిషనరీలు ఆధ్యాత్మిక విషయాల్లోనే కాక పలు పాఠశాలలు, కళాశాలలు నిర్మించారు.
 
  ప్రజలకు మంచినీటి సౌకర్యాలతో పాటు గ్రంథాలయాలకు స్థలాలు, ఆట స్థలాలు, విద్యుత్ సౌథానికి స్థలం కేటాయించారు. అనేకమంది పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మైక్రోఫైనాన్స్ మహిళాభివృద్ధికి తోడ్పడుతున్నారు. 2009 మే నెలలో  విచారణ గురువులుగా వచ్చిన ఫాదర్ బెల్లంకొండ జయరాజు చర్చి నూతనీకరణ పనులను రూ.40 లక్షలతో ప్రారంభించి అత్యంత వేగంగా పని పూర్తి చేసి గ్రామంలోని ప్రజలందరి మన్ననలను పొందారు. విచారణ గురువులకు నివాసంగా ఉన్న పాత బంగ్లా భవనంలో యాత్రీకులకు సౌకర్యాలను కల్పించారు. గ్రామానికి చెందిన కొంతమంది కళాకారులు డిక్మన్ పరిషత్ పేరుతో కళాపరిషత్‌ని స్థాపించి నాటికలను ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో చర్చి ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో సుమారు రూ.45 లక్షలతో సుమారు 81 అడుగుల ఎత్తులో ఫాదర్ తియోడర్ డిక్మన్ మెమోరియల్ బెల్ టవర్ నిర్మాణం చేపట్టారు. ఈ నెల 8 తేదీన టవర్‌పై మరియతల్లి విగ్రహం, సుమారు 500 కేజీల
 
 బరువు కలిగిన పోలాండ్ గంటను ప్రతిష్టించారు.ఈ నెల 24 తేది అర్ధరాత్రి దివ్యపూజా బలి కార్యక్రమానికి వస్తున్న గుంటూరు పీఠాధిపతి డాక్టర్ గాలిబాలి గంటను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో చర్చిగా ఫిరంగిపురం చర్చి జిల్లాలో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రతి ఏడాది 24 వ తేదీ అర్ధరాత్రి గుంటూరు పీఠాధిపతి డాక్టర్ గాలిబాలి క్రీస్తు జయంతి వేడుకలను ప్రారంభించి దివ్యపూజాబలిని సమర్పించి శాంతికపోతాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం శాంతిసందేశం ద్వారా క్రీస్తుజననం గురించి వివరిస్తారు. నూతనంగా దివ్యసత్‌ప్రసాదాన్ని తీసుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.  25వ తేదీ జరిగే ఏసుక్రీస్తు జయంతికి ఫిరంగిపురం ముస్తాబయింది.
 
 భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
 క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జోసిల్ కంపెనీ సౌజన్యంతో మంచినీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఫాదర్ బెల్లంకొండ జయరాజు తెలిపారు. నూతనంగా సుమారు 32 మరుగుదొడ్లు, క్షౌరశాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఫాదర్ బంగ్లాలోని పాత భవనాన్ని భక్తుల విశ్రాంతి భవనంగా మార్చి వారికే తక్కువ రుసుం ఇచ్చేలా చూస్తామన్నారు. గ్రామంలో తేరు ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.    - ఫాదర్ జయరాజు

మరిన్ని వార్తలు