'ఫూలిష్‌' శాఖ..

16 Apr, 2019 13:08 IST|Sakshi
ఉప్పాడ పోలింగ్‌ స్టేషన్‌ లోపలకు వెళ్లిన ఎమ్మెల్యే వర్మ కారు

అధికారపార్టీకి వంత పాడుతున్న ఖాకీలు

పిఠాపురంలో పోలీసుల నిరంకుశత్వం

టీడీపీ నేత ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు

వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరణ

ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎట్టకేలకు ఫిర్యాదు స్వీకరణ

తూర్పుగోదావరి , పిఠాపురం: ప్రజల పట్ల జవాబుదారీతనంతో పని చేయాల్సిన పోలీసులు పక్కదారి పట్టారు. చట్టాన్ని అధికారపార్టీ చుట్టంగా మార్చేశారు. పిఠాపురంలోని పోలీసులు అధికార పార్టీ నేతలకు సలాం కొడుతూ పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం లేకుండా చేశారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఈ ఖాకీ అధికారులు, అధికార పార్టీకి అండదండలుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 11వ తేదీన జరిగిన ఎన్నికల పోలింగ్‌ సమయంలో వారు ఏకపక్షంగా వ్యవహరించి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి తీరు పూర్తిగా వివాదాస్పదమైంది. నిబంధనలను తుంగలోకి తొక్కి పోలింగ్‌ స్టేషన్‌లోకి వెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోని పోలీసులు, తిరిగి ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేయడం చూస్తే పోలీసులు స్వామి భక్తిని ఏవిధంగా చాటుకున్నారో అర్థమవుతోంది. పోలింగ్‌ స్టేషన్‌లోకి నేరుగా కారులో వెళ్లిన అధికార పార్టీ నేత అక్కడ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని అక్కడ బూత్‌ ఏజంట్లు ఆధారాలతో చూపించినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రతిపక్ష నాయకులు స్థానిక పోలీసులతో తమకు న్యాయం జరగదని భావించి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు.

పోలీసుల తీరుకు మచ్చుతునకలు ఇవిగో..
కొత్తపల్లి మండలం ఉప్పాడ హైస్కూలులో పోలింగ్‌ స్టేషన్లోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ తన వాహనంతో సహా వెళ్లి గన్‌మెన్‌ వెంట రాగా పోలింగ్‌ స్టేషన్లో కలియతిరుగుతూ ప్రచారం చేసినట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పోలింగ్‌ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఒక్క ఎన్నికల అధికారులు తప్ప ఇతరులు (ఏ రాజకీయ పార్టీల నేతలు) వాహనాలలో రాకూడదన్న నిబంధన ఉంది. దానిని తుంగలోకి తొక్కి ఎమ్మెల్యే తన కారుతో సహా వచ్చారని ప్రతిపక్ష పార్టీల నేతలు అభ్యంతరం చెప్పగా అక్కడే ఉన్న డీఎస్పీ తిలక్‌ వారిని వారించి ఎమ్మెల్యేను పోలీసు భద్రత నడుమ పోలింగ్‌ స్టేషన్‌ నుంచి బయటకు పంపించేశారు. అయితే పోలింగ్‌ సమయంలో వివాదాలు ఎందుకని దీనిపై ప్రతిపక్ష నేతలు మౌనం వహిస్తే, దేశం నేతలు మాత్రం తమపై దాడి చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం, దానిపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు జరిగిన సంఘటనపై విచారణ చేయాలని, నిబంధనలు పాటించని దేశం నేతలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ ఏజంట్లు ఇచ్చిన ఫిర్యాదును కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తిరస్కరించారు. దీంతో వారు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించగా అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో దేశం నేతలపై కేసు నమోదు చేయడం గమనార్హం.

పూటకోమాటతో డ్రామా..
ఉప్పాడ సంఘటనలో వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసు నమోదు విషయంపై పోలీసులు గడియకో మాట మారుస్తూ డ్రామాలకు తెరలేపారు. తొలుత వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెండెం దొరబాబు ఆయన అనుచరులు ఐదుగురితో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్టు చెప్పిన పోలీసులు తరువాత మాటమార్చారు. దొరబాబు పేరులేదని కొంత సేపు ఉందని కొంతసేపు చెప్పుకు రావడంతో పాటు కేసు వివరాలు మీడియాకు ఇవ్వడానికి నిరాకరించడం కొసమెరుపు.

ఎస్సై ఏకపక్షంగా..
పిఠాపురం మండలం చిత్రాడలో ఎన్నికల సందర్భంగా జరిగిన వివాదంలో పట్టణ ఎస్సై శోభన్‌కుమార్‌ ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీ నేతలపైనే దాడి చేసి తీవ్ర గాయాలపాల్జేశారని ఆపార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ ఎస్సైపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఆసైతం చేసినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. పోలింగ్‌ స్టేషన్‌కు దగ్గరలోనే దేశం శిబిరం ఏర్పాటు చేసి ప్రచారం చేయడం వల్లే వివాదం తలెత్తగా వారిని ఏమీ అనకుండా విచక్షణారహితంగా తమపై దాడి చేసి గాయపర్చినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

పిఠాపురం మండలం బి కొత్తూరుకు చెందిన ఒక వ్యక్తిని కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద దారికాచి దేశం నేతలు దాడి చేసినట్టు బాదితుడు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలం కిర్లపూడి పోలీసు స్టేషన్‌ పరిది కావడంతో కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈకేసులో కిర్లంపూడి పోలీసులు సైతం అధికారపార్టీ నేతల ఆదేశాలతో నిందితులను అరెస్టు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార పార్టీకి తొత్తుగా మారిన పిఠాపురం రూరల్‌ ఎస్సై స్వామి భక్తిని చాటుకున్న పీవీఆర్‌ మూర్తి అదే కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై దెబ్బలు తిని ఆస్పత్రి పాలైన వ్యక్తిపై ఎస్పీ, ఎస్టీ కేసు నమోదు చేయడం పోలీసుల నిరంకుశత్వానికి నిదర్శనంగా బాధితుడు వాపోతున్నాడు.

మరిన్ని వార్తలు