తారస్థాయికి పిఠాపురం ‘దేశం’ పోరు

31 Jan, 2014 00:22 IST|Sakshi
సాక్షి ప్రతినిధి, కాకినాడ :పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో రగులుకున్న విభేదాలు నానాటికీ ప్రజ్వరిల్లుతున్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్మ ఒంటెత్తు పోకడలపై అక్కడి తెలుగుతమ్ముళ్లు కత్తులు నూరుతున్నారు. ఆయన విషయంలో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అవసరమైతే పార్టీకి దూరమయ్యేందుకు సైతం వెనుకాడేది లేదని హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతల వద్ద కుండబద్దలు కొట్టడం.. పిఠాపురంలో పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితికి అద్దం పడుతోంది.
 
 ఆవిర్భావం నుంచి  పార్టీలో పని చేస్తున్న నాయకులను  దూరంచేసి నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్టు పార్టీ కార్యక్రమాలు చేసుకుపోతున్నారంటూ గత కొంతకాలంగా నియోజకవర్గ నాయకులు వర్మపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వచ్చే ఎన్నికల్లో వర్మకు టిక్కెట్టు ఇవ్వకుండా అడ్డుకోవడమే ఏకైక అజెండాగా నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో మకాం పెట్టడం జిల్లాలోని పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వర్మ వ్యవహారశైలిని జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఆయన ప్రత్యర్థి వర్గీయులు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద పంచాయతీ పెట్టేందుకు అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు. 
 
 వర్మకిస్తే మళ్లీ ఓటమే..
 వర్మ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు ఏ మండలంలో చేసినా ఆ మండల నాయకులకు కనీసం మాటవరసకైనా చెప్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఓట్లపరంగా అత్యల్ప సంఖ్యాకులున్న వర్గానికి చెందిన వర్మకు టిక్కెట్టు ఇస్తే తామంతా మూకుమ్మడి రాజీనామాలకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర నేతల వద్ద కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 
 
 వర్మ తీరును పార్టీ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి కళావెంకట్రావు, రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్‌ల దృష్టికి తీసుకువెళ్లడం పిఠాపురం ‘దేశం’లో అంతర్గత పోరు తారస్థాయి చేరుకున్నదనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.  నియోజకవర్గంలో ప్రధానమైన రెండు సామాజికవర్గాలను విస్మరించి పట్టుమని వెయ్యి మంది ఓటర్లు కూడా లేని సామాజికవర్గానికి చెందిన వర్మకు టిక్కెట్టు ఇస్తే ఈసారి కూడా అక్కడ ఓటమి ఖాయమని ఆయన వ్యతిరేకులు రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేశారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నియోజకవర్గంలో పర్యటించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే దివంగత వెన్నా నాగేశ్వరరావు కుమారుడు జగదీష్‌ను కనీసం కలుసుకునేందుకు సైతం అంగీకరించని వర్మ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును వారంతా కళావెంకట్రావు ముందుంచారు.
 
 నాయకత్వాన్ని మార్చాల్సిందే...
 జెడ్పీటీసీ మాజీ  సభ్యులు వెంగళి సుబ్బారావు, జవ్వాది కృష్ణమాధవరావు, చిత్రాడ సర్పంచ్ సింగంపల్లి బాబూరావు, గుబ్బల తులసీకుమార్, పార్టీ మండల అధ్యక్షుడు అల్లుమల్లు విజయకుమార్ తదితరులు వర్మను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో ఉన్నారు.వర్మను నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో బలమైన సామాజికవర్గం నుంచి నాయకుడిని ఎంపికచేసే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటామని వారంతా తెగేసి చెప్పారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వెన్నా జగదీష్ లేదా ఆయన భార్య సుజాత, గుబ్బల తులసీకుమార్, సింగంపల్లి బాబూరావు..ఇలా నలుగురు ఆశావహుల పేర్లను తెరపైకి తెచ్చి వారి బయోడేటాలను రాష్ట్ర నేతలకు అందచేశారని సమాచారం. వర్మ వ్యతిరేకులు ఆయన తీరును తూర్పారబడుతూ తయారుచేసిన ఒక నోట్‌ను అందచేసేందుకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం వేచి చూస్తున్నారు. చంద్రబాబు కలిసిన తరువాత ఏమి జరగనుందో, పిఠాపురం ‘దేశం’లో అంతర్యుద్ధం ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
 
మరిన్ని వార్తలు