గుంకలాంకే ఛాన్స్!

18 Feb, 2015 03:46 IST|Sakshi
గుంకలాంకే ఛాన్స్!

 విజయనగరం కంటోన్మెంట్ / విజయనగరం రూరల్ : జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. స్థల పరిశీలన కోసం జిల్లాకొచ్చిన బృందం దాదాపు సానుకూలత చూపించింది. విజయనగరం మండలం గుంకలాంలోని స్థలం పట్ల బృందం మొగ్గు చూపింది. కేంద్రం ఆమోదిస్తే ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. గతం లో పాచిపెంట మండలంలో స్థలాన్ని పరిశీలించి అనుకూలంగా లేదని తేల్చేశారు. దీంతో గిరిజన  వర్సిటీ పక్కజిల్లా విశాఖకు తరలిపోనుందని అందరూ భావించారు. తాజాగా కొత్తవలస మండలం రెల్లి, విజయనగరం మండలం గుంకలాంలలో స్థలాన్ని పరిశీలించిన కేంద్రకమిటీ గుంకలాంవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.
 
 కేంద్రం నిధులిస్తే జేఎన్‌టీయూలో తాత్కాలికంగా గిరిజనవర్సిటీని ఏర్పాటు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్ మంత్రి నారాయణ ప్రకటించడం మరింత నమ్మకం కలిగిస్తోంది. గిరిజన యూనివర్సిటీ స్థల పరిశీలన కోసం కేంద్ర మానవ వనరుల శాఖ సంయుక్త కార్యదర్శి సుక్‌బీర్ సింగ్ సందు ఆధ్వర్యంలోని  కేంద్ర బృందం మంగళవారం జిల్లాలో పర్యటించింది. ఆయనతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుమితా దావ్రా జిల్లాకు రాగా వారికి  రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ,  కలెక్టర్  ఎంఎం నాయక్‌లు జిల్లాలోని స్థలాలను చూపిస్తూ  అక్కడి పరిస్థితులు వివరించారు.  తొలుత కొత్తవలస మండలం రెల్లిలో ఉన్న స్థలాలను పరిశీలించగా, మధ్యాహ్నం విజయనగరం మండలం గుంకలాం గ్రామ పరిధిలో ఉన్న స్థలాలను పరిశీలించారు.  అనువైన స్థలం విషయమై సుదీర్ఘంగా చర్చించుకున్నారు.
 
 వారి తీరును చూస్తుంటే రెల్లి గ్రామం కన్నా గుంకలాంపైనే మక్కువ చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. తొలుత కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో గిరిజన యూనివర్సిటీకి సరిపడా స్థలం ఉందని చూపించగా, దానిని పరిశీలించారు. ఇక్కడ 347.47 ఎకరాల మైదాన ప్రాంతముంది. 178.77 ఎకరాలు గుట్టలతో నిండిఉంది. మొత్తం 526.24 ఎకరాలను బృందం పరిశీలించింది. అనంతరం విజయనగరం మండలంలోని గుంకలాం గ్రామ పరిసరాల్లో ఉన్న 347.63 ఎకరాల డి పట్టా భూములు, 163.78 ఎకరాల కొండపోరంబోకు, 29.33ఎకరాల బంజరు భూమి,4.23 ఎకరాల రస్తా భూములతో కలిపి 504.97 ఎకరాలను బృందం పరిశీలించింది. మొత్తం ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ తన పరిశీలన నివేదికను కేంద్రానికి అందించనుంది. జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పరిశీలనలు చేసిన కేంద్ర బృందం ఎక్కువగా గుంకలాంకు ప్రాధాన్యం ఇనిచ్చినట్టు స్పష్టమవు తోంది.
 
 కొత్తవలసలోని రెల్లిలో భూముల కన్నా గుంకలాంలోని భూములు గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నట్టు బృందం గుర్తించింది. కొత్తవలసలో ఉన్న భూములు ఎక్కువగా గుట్టలతో పాటు ఎక్కువగా ఏటవాలుగా ఉన్నాయి. అలాగే అక్కడి భూముల్లో నిర్మాణాలకు కోర్టు అనుమతులు కూడా  అవసరముంది. దీనికి తోడు ఇక్కడ స్థలం ఎక్కువగా కొండ ప్రాంతం నిండిఉందని   కేంద్ర బృందం వ్యాఖ్యానించినట్టు   మంత్రి నారాయణ విలేకరులకు తెలిపారు. అలాగే గుంకలాం భూములు పరిశీలించిన ఈ ఐదుగురు సభ్యులున్న కమిటీ సంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. అలాగే ఇక్కడున్న భూముల్లో గిరిజన యూనివర్సిటీ  నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలూ లేకపోవడంతో పాటు జిల్లా కేంద్రానికి దగ్గరలోనే ఉండటాన్ని కూడా సానుకూలంగా తీసుకున్నారు. దీంతో ఇక్కడ గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదమే తరువాయి అన్న భావన అందరిలో కలుగుతోంది. మరో వైపు మంత్రి నారాయణ విలేకర్లతో మాట్లాడినప్పుడు గుంకలాంకే ప్రాధాన్యతనిచ్చారు.
 
 జేఎన్‌టీయూలో తాత్కాలికంగా తరగతులు
 జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని అంశాలూ సానుకూలంగా ఉండడంతో కేంద్రానికి నివేదించాక ఆమోదం లభించి నిధులు విడుదలైతే   వచ్చే ఏడాది నుంచే గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  యూనివర్సిటీకి భవన సముదాయం  నిర్మంచే వరకూ విజయనగరం పట్టణానికి సమీపంలో ఉన్న జేఎన్‌టీయూలో తాత్కాలికంగా తరగతులు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనిపై మంత్రి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ఆమోదం లభిస్తే జేఎన్‌టీయూలో తాత్కాలికంగా యూనివర్సిటీని ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు ఈ విష యమై కూడా బృందం సభ్యులు జేఎన్‌టీయూ అధికారులను అడిగినట్టు చెబుతున్నారు. జేఎన్‌టీయూ అధికారులు కూడా తాత్కాలికంగా భవనాన్ని ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారని సమాచారం.
 

మరిన్ని వార్తలు