హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు

12 Jul, 2019 15:44 IST|Sakshi

బడ్జెట్‌పై ఆనందం వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

సాక్షి, అమరావతి: పల్నాడు ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రకటించడం అభినందనీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలను అమలు చేసే దిశగా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథకంలో నడవడం ఖాయమని అభిప్రాయపడ్డారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలతో సహా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వెనుకబడిన ఉద్దానం ప్రాంతంకు బడ్జెట్‌లో సరైన ప్రాధాన్యత ఇచ్చారని పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ అప్పల రాజు సంతోషం వ్యక్తం చేశారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చర్యలు అభినందనీయమన్నారు. తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతానికి పునర్ నిర్మాణం దిశగా ప్రభుత్వం పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. జీడి, మామిడి, అరటి, కొబ్బరి పంటలకు మంచి కేటాయింపులు చేశారన్నారు. పేద ప్రజలను, వెనుకబడిన ప్రాంతాలను ఆదుకునే విధంగా బడ్జెట్‌ను రూపొందించడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. 

దేశంలోనే తొలిసారి..
పారదర్శక పాలనకు తమ ప్రభుత్వం కట్టుబడి వుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌ వ్యాఖ్యానించారు. జ్యుడీషియల్ కమిషన్ ద్వారా అవినీతిని నియంత్రించాలని కృతనిశ్చయంతో ఉందన్నారు.  అమ్మ ఒడి పథకం అనేది దేశంలోనే తల్లులకు మొట్టమొదటి సారిగా అందిస్తున్న ప్రోత్సాహమని ఆయన స్పష్టం చేశారు. రైతులకు పూర్తి బరోసా కల్పించే చర్యలు,  ఆరోగ్యశ్రీ  పౌరసరఫరా సేవలను నేరుగా ప్రజల ఇంటికే అందించే చర్యలు అభినందనీయంమన్నారు. మహిళా సంక్షేమం కోసం సున్నావడ్డీ అమలు, ఎస్సీ, ఎస్డీ,బీసీ, మైనార్టీలకు బడ్జెట్‌లో కేటాయింపులు  అద్భుతంగా ఉన్నామని అభినందించారు. 

మరిన్ని వార్తలు