రేణిగుంట రన్‌వేపై తప్పిన ముప్పు

30 Jan, 2019 04:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఎయిరిండియా విమానం టేకాఫ్‌ సమయంలో కుంగిన రోడ్డు 

పైలట్‌ అప్రమత్తతతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు 

రేణిగుంట, శంషాబాద్‌: చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వే చివర కుంగడంతో అప్రమత్తమైన పైలట్‌ చాకచక్యంగా విమానాన్ని గాల్లోకి లేపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విషయాన్ని పైలట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెప్పడంతో వారు కుంగిన రన్‌వేకు మరమ్మతులు చేసి మంగళవారం రాత్రి 7.40 గంటల సమయంలో విమానాల రాకపోకలకు అనుమతించారు. సుమారు 5 గంటలపాటు విమాన రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లో అవస్థలు పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన పలు విమానాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి నిలిచిపోయాయి. అలాగే తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన రెండు ఇండిగో విమానాలు, స్పైస్‌జెట్‌ విమానం నిర్ణీత సమయానికి రాకపోవడం, తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 5.45, 7.10 గంటలకు వెళ్లాల్సిన విమానాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  

వర్షంలోనే రన్‌వే విస్తరణ పనులు 
అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలకు వీలుగా రేణిగుంట విమానాశ్రయంలో రన్‌వే విస్తరణకు కేంద్ర విమానయానశాఖ అనుమతులు మంజూరుచేసింది. రెండ్రోజుల క్రితం రన్‌వే విస్తరణ పనులు ప్రారంభించారు. సోమవారం రాత్రి 10 గంటలకు వర్షంలోనే రన్‌వే పొడిగింపు పనుల్ని కొనసాగించారు. మంగళవారం ఉదయం నుంచి ఆ రన్‌వేపై పలు విమానాలు రాకపోకలు సాగించాయి. అవన్ని చిన్న విమానాలు కావడంతో రన్‌వే సగం వరకే వెళ్లి టేకాఫ్‌ తీసుకున్నాయి. అయితే మధ్యాహ్నం 2.50 గంటలకు రేణిగుంట నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానం పెద్దది కావడంతో రన్‌వే చివరి వరకు వెళ్లి టేకాఫ్‌కు ప్రయత్నించింది. రన్‌వే చివర కుంగిఉండడాన్ని గమనించిన పైలట్‌ అప్రమత్తమై విమానాన్ని వెంటనే గాల్లో లేపాడు. విషయాన్ని కేంద్ర విమానయానశాఖ ఉన్నతాధికారులకు పైలట్‌ ఫిర్యాదు చేశాడు. 

మరిన్ని వార్తలు