వేంపెంటలో ‘ప్లాంట్’ చిచ్చు

30 May, 2014 01:42 IST|Sakshi

వేంపెంట (పాములపాడు), న్యూస్‌లైన్:  మండలంలోని వేంపెంట గ్రామంలో పవర్‌ప్లాంట్ నిర్మాణ చిచ్చు రగులుతోంది. గ్రామస్తులకు వ్యతిరేకంగా గురువారం పోలీస్ పహారాలో పనులు ప్రారంభించారు. పనులు వెంటే ఆపివేయాలని, లేదంటే తాము గ్రామాన్ని విడిచి వెళతామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. 2011 జులైలో నిప్పుల వాగులో పవర్‌ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. 7.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి దాదాపు రూ.35కోట్ల తో ర్యాంక్ మినీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రెండేళ్ల కిందట భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ ప్లాంట్ నిర్మాణం వేంపెంట గ్రామం మధ్యలో జరుగుతున్నందున గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.

దీంతో పలుమార్లు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామానికి వచ్చి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు.. అప్పటి రాష్ట్ర న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామిలు కూడా ప్రజలతో చర్చించారు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటుతాయని, శబ్ద కాలుష్యం, వ్యవసాయ బోరు బావులకు, సాగుతాగు నీటి సమస్యలు ఉత్పన్నమవుతాయని గ్రామస్తులు ఆందోళనకు గురై తమ గోడును వారితో చెప్పుకునప్నారు. కలెక్టర్  సుదర్శన్‌రెడ్డి గత ఏడాది  జులై 13న గ్రామానికి చేరుకుని సభ నిర్వహించి  వారితో అభిప్రాయాలు సేకరించారు. గ్రామస్తుల అభీష్టం మేరకే పవర్‌ప్లాంట్ పనులు జరుగుతాయని ప్రజలకు తెలిపారు. ఆ సమయంలేనే ప్లాంటు పనులు నిలిపి వేయించారు.

 ప్రజల కోరికకు విరుద్ధంగా
 ప్రజల అభీష్టానికి విరుద్ధంగా గురువారం గ్రామంలో పవర్ ప్లాంట్ పనులు ప్రారంభించారు. గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా బస్టాండ్ సెంటర్‌లో, పనులు జరిగే చోట, ఎస్సీకాలనీలోని స్థూపం వద్ద ప్రధాన కూడళ్లలో డీఎస్పీ జి.నరసింహారెడ్డి, సీఐ రవిబాబుల ఆధ్వర్యంలో దాదాపు 60 మంది పోలీసు పహారా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. పనులు చేసుకునేందుకు తమకు ప్రభుత్వ అనుమతులున్నాయని, అయితే గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఉందని పనులు జరిగేందుకు పోలీసు ఫోర్సు కావాలని కోరడంతో బలగాలు ఏర్పాటు చేశామన్నారు.

 గ్రామం విడిచి వెళతాం..
 పజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా పవర్‌ప్లాంటు పనులు జరుపుతున్నందున గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు గ్రామస్తులు గాండ్ల రమేష్, సామేలు, సాలన్న, ఏసురత్నం, కాంతారెడ్డి, రమణారెడ్డి, కోరబోయిన శాంతు, చెలమారెడ్డి, బోయశ్రీనివాసులు పేర్కొన్నారు. పవర్ ప్లాంట్ పనులు ప్రారంభం కావడంతో గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పనులు చేయబోమని హామీ ఇచ్చి ఈరోజు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల మాటకు విలువ లేనప్పుడు గ్రామంలో ఉండటం వ్యర్థమని ప్రజలంతా మూకుమ్మడిగా గ్రామం విడిచి వెళ్లేందుకు సిద్ధం కావాలని తీర్మానించామన్నారు. ‘ ఏరాసు, కేఈలు పెద్దోళ్లు.. వారి రాజకీయ, ధన బలాన్ని చూపేం దుకే గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దించారు.’ అని  బోరెడ్డి శివారెడ్డి ఆరోపించారు. గ్రామంలోని ప్రజలంతా రోడ్డుమీద పడితే అధికారులకు, పవర్‌ప్లాంట్ యజమానులకు ఆనందమా అంటూ జాను అనే వ్యక్తి ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు