అలా ప్రయత్నిస్తే పచ్చతోరణమే..!

23 Jun, 2020 10:22 IST|Sakshi
దర్శి వద్ద ప్రవహిస్తున్న ఎన్‌ఎన్‌పీ కెనాల్

సాగర్‌ కాలువల వెంబడి మొక్కలు నాటితే బహుళ ప్రయోజనం 

జిల్లాలో 200 కిలోమీటర్ల మేర నాగార్జున సాగర్‌ కాలువ  

కాలువ చుట్టూ మొక్కలు నాటితే పర్యావరణ సమతుల్యానికి అవకాశం 

ఎన్‌ఎస్‌పీ స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా రక్షించేందుకు  వీలు

బిర బిరా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వందల..వేల కిలోమీటర్ల ప్రయాణించి జిల్లాలో లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ ఎంతో మంది దాహం తీరుస్తోంది. నీటి విడుదల సమయంలో సాగర్‌ కాలువ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అంతటి ప్రాధాన్యం ఉన్న సాగర్‌ కాలువల వెంబడి మొక్కలు నాటితే పచ్చదనం పరిఢవిల్లే అవకాశాలు ఉన్నాయి.  

సాక్షి, దర్శి టౌన్‌: జిల్లాలో నాగార్జున సాగర్‌ కాలువ 200 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కాలువ కరకట్టలు పోను ఇరువైపులా సుమారు 60 అడుగుల చొప్పున ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలాలు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురి కాగా..మరికొన్ని ప్రాంతాల్లో చిల్లచెట్లు పెరిగి వృథాగా ఉన్నాయి. ఈ స్థలాలను సద్వినియోగం చేసుకుంటే పెద్ద ఎత్తున మొక్కలు పెంచే అవకాశం ఉంది. మొక్కలు కాలువ పక్కనే ఉన్నందున తేమతోనే మొక్కలు బతికే అవకాశం ఉంది. మామిడి, ఉసిరి, నేరేడు వంటి పండ్ల మొక్కలు లేదంటే టేకు, ఎర్రచందనం, కొబ్బరి వంటివి నాటితే మంచి ప్రయోజనం ఉంటుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ప్రక్రియ చేపడితే మరి  కొందరికి ఉపాధి సైతం లభించే అవకాశాలు ఉన్నాయి.  చదవండి: పలమనేరులో నువ్వా- నేనా..?

కిలో మీటర్ల మేర ....  
జిల్లాలో సాగర్‌ ప్రధాన కాలువ 65 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. అద్దంకి బ్రాంచ్‌ కాలువ 30.5 కి.మీలు, దర్శి బ్రాంచ్‌ కాలువ 23 కి.మీలు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువ 54 కి.మీలు, పమిడిపాడు బ్రాంచి కాలువ 36 కి.మీలు, మోదేపల్లి మేజర్‌ 27 కి.మీలు, రజానగరం మేజర్‌ 30 కి.మీల మేర సాగుతున్నాయి. వీటిలో వాగులపై, రహదారుల వద్ద నిర్మించిన వంతెనలు ఇతరత్రా అడ్డంకులు ఉన్నా ఇవి 15శాతానికి మించి ఉండవు. మొక్కకు మొక్కకు 8 మీటర్ల ఖాళీతో మొక్కలు నాటవచ్చు. ఈ లెక్కన కాలువ కట్టకు ఒక వైపు ఎటువంటి అవరోధం లేని ప్రాంతంలో మూడు వరుసలు చొప్పున మొక్కలు పెంపకం చేపట్టవచ్చు. ఒక్కో లబ్ధిదారునికి 150 మొక్కల చొప్పున అప్పగించినా ఏడు వేల మంది వరకు లబ్ధి చేకూర్చవచ్చు. మరో వైపు కాలువకు ఇరువైపులా పచ్చని వాతావరణం ఏర్పడుతుంది. పర్యావరణానికి సైతం మేలు చేకూరుతుంది.  

ఎంతో మందికి ఉపాధి.. 
భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ పచ్చతోరణం పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా భూమి లేని నిరుపేదలను ఎంపిక చేసి ప్రభుత్వ భూమిలో చెట్టుపట్టాలు ఇస్తారు. ఆ భూమిలో పండ్ల జాతి, కలప జాతి మొక్కలు పెంచుకోవచ్చు. ఒక్కో లబ్ధిదారుడు 200 మొక్కల వరకు నాటుకోవచ్చు. వాటి పెంపకానికి ఉపాధి హామీ పథకం నుంచి ఐదేళ్ల పాటు నిధులు మంజూరు చేస్తారు. రైతులు ఫలసాయం కూడా పొంది ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందవచ్చు. భూమి విక్రయించే హక్కు మాత్రం లబ్ధిదారుడికి ఉండదు. ప్రస్తుతం కూడా సాగర్‌ కాలువకు ఇరువైపులా మొక్కల పెంపకానికి అప్పగిస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. రెవెన్యూ, ఎన్‌ఎస్‌పీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటే హారితహారం అవుతుందని ప్రజలంటున్నారు. 

మరిన్ని వార్తలు