నిషేధం అమలయ్యేనా?

2 Oct, 2018 13:17 IST|Sakshi
ప్లాస్టిక్‌ కవర్లలో వేడివేడి సాంబారు పార్శిల్‌ చేస్తున్న దృశ్యం

నగరంలో ప్లాస్టిక్‌ నిషేధం

గాంధీ జయంతి సందర్భంగా నేటి నుంచి అమలు

గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు సిద్ధం

వినియోగిస్తే రూ.500 వరకు జరిమానా

అమలు చేస్తారో.. హడావుడి చేసి వదిలేస్తారో..?

సందేహం వ్యక్తం చేస్తున్న నగరవాసులు

టీ స్టాల్‌కి వెళితే ప్లాస్టిక్‌ కప్పు.. విందు భోజనాల్లో ప్లాస్టిక్‌ ప్లేట్లు.. దాహం వేస్తే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌.. ఇలా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్లాస్టిక్‌ వినియోగం జీవితంలో ఒక భాగమైపోయింది. ఇందుగలదు అందులేదని సందేహంబు వలదు అన్నట్టు.. ఎక్కడ చూసినా ప్లాస్టికే. హోటళ్లు, టీ స్టాళ్లు, కర్రీ పాయింట్లు, కిరాణా షాపులు, రైతు బజార్లు, తోపుడు బండ్లు.. ఒకటేమిటి పాలిథిన్‌ సంచులు కనిపించని ప్రదేశం లేదు. కొనే వస్తువు చిన్నదైనా, పెద్దదైనా పాలిథిన్‌ కవర్‌ తప్పనిసరైంది. చివరికి డ్రైనేజీలు, చెత్తకుప్పల్లో సైతం వాటి వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్రమాదకారకమైన పాలిథిన్‌ సంచులు, టీ కప్పులు, ప్లేట్లు యథేచ్ఛగా వాడుతున్నారు.

50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పాలిథిన్‌ కవర్లపై నిషేధం ఒట్టిమాటగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఒంగోలులో ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు నగరపాలక సంస్థ రంగంలోకి దిగింది. నగరంలో ప్లాస్టిక్‌ అమ్మకం, వాడకం, కొనుగోలును నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడైనా ప్లాస్టిక్‌ వినియోగం కనిపిస్తే రూ.100 నుంచి రూ.500 వరకు జరిమానా విధించేలా చర్యలు చేపట్టింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ఒంగోలు నగరంలో నిషేధం అమలుకానుంది. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు  ప్రత్యేక దృష్టి సారించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సక్రమంగా అమలవుతుందా..? లేక ఆరంభశూరత్వంగా మిగిలిపోతుందా.. అనే సందేహాలు నగర వాసుల నుంచి వ్యక్తమవుతోంది.

ఒంగోలు టౌన్‌:ఒంగోలు నగర పాలక సంస్థలో ఎటు చూసినా ప్లాస్టిక్‌ వ్యర్ధాలే కనిపిస్తుంటాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో ప్లాస్టిక్‌ వినియోగం మరింతగా పెరిగిపోయింది. ఇళ్లల్లో నుంచి, పని ప్రదేశాల నంచి ఖాళీ చేతులతో వెళ్లి భోజనం ప్యాకెట్లు, కర్రీ ప్యాకెట్లు, దోశ ఇడ్లీ ప్యాకెట్లు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చికెన్, మటన్, చేపలు..
ఇలా ప్రతిదానిని ప్లాస్టిక్‌ కవర్లలో వేయడం, ఆ పదార్ధాలన్నీ తీసుకువచ్చేందుకు మరో ప్లాస్టిక్‌ కవర్‌ను ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. టీ తాగడానికి, జ్యూస్‌ తాగడానికి ప్లాస్టిక్‌తో తయారు చేసిన డిస్పోజల్‌ గ్లాస్‌లనే వాడుతున్నారు. కొన్నిచోట్ల మాత్రం పేపర్‌ గ్లాస్‌లు వాడుతున్నారు. ఇలా ప్రతి దానిలో ప్లాస్టిక్‌ భూతం కనిపిస్తోంది. వాటిని వినియోగించిన తరువాత కాలువలు, చెత్తలో పడవేయడంతో తదుపరి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం జంతువులపై ప్లాస్టిక్‌ భూతం పడగ విప్పగా, దానిని అలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో మనుషులపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు..
ఒంగోలు నగరంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని వంద శాతం అమలు చేసేందుకు వీలుగా ప్లాస్టిక్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ను యంత్రాంగం తెరపైకి తీసుకువచ్చింది. ఈ రూల్స్‌ ప్రకారం ప్లాస్టిక్‌ను ఎవరు వినియోగించినా బాధ్యులవుతారు. ప్లాస్టిక్‌ వాడినా, అమ్మినా, కొనుగోలు చేసినా ఆ ముగ్గురిని బాధ్యులను చేయనున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానావిధిస్తారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు వీలుగా ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు నగరమంతా జల్లెడపడుతూ పూర్తిగా ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిలిపి వేసేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో అయితే ప్లాస్టిక్‌ వినియోగం ఎక్కువగా జరుగుతుందో, అలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించనుంది.

మాల్స్‌ వసూలు నగర పాలక సంస్థ ఖజానాకు..
ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో మాల్స్‌ సంఖ్య పెరిగింది. కొన్ని మాల్స్‌ తమ వద్ద వినియోగదారులు సరుకులు కొనుగోలు చేసినప్పటికీ వాటిని వాళ్ల ఇళ్లకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఆ మాల్స్‌ ముద్రించిన కవర్లను విక్రయిస్తోంది. ఎక్కడైనా వందలు మొదలుకొని వేలాది రూపాయల వరకు నిత్యావసర సరుకులు, వస్తువులు కొనుగోలు చేస్తే వాటిని తీసుకువెళ్లేందుకు కవర్లను అందించేవారు. ఇటీవల కాలంలో నగరంలో మాల్స్‌ ఏర్పడిన తరువాత అక్కడ కొనుగోలు చేసిన వస్తువులను తీసుకువెళ్లే కవర్లకు ఒక్కో వినియోగదారుడి వద్ద మూడు నుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. గాంధీ జయంతి నుంచి నగరంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించిన నేపథ్యంలో మాల్స్‌ వినియోగదారుల నుంచి కవర్ల కోసం వసూలు చేసిన డబ్బును ఇక నుంచి నేరుగా నగర పాలక సంస్థ కార్యాలయ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది.

మిగిలిన దుకాణాలకు యూజర్‌ ఛార్జీలు..
ఒంగోలు నగరంలోని వస్త్ర దుకాణాలు, మందుల దుకాణాలు, ఇతర దుకాణాలు తమ వద్ద దుస్తులు, మందులు, ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో ప్రత్యేకంగా ముద్రించిన కవర్లలో పెట్టి ఇస్తుంటారు. ఇక నుంచి అలాంటి దుకాణాలకు యూజర్‌ ఛార్జీలు వేయనున్నారు. ఆ దుకాణంలో ఎంతమంది వినియోగదారులు వచ్చారు, ఎన్ని వస్తువులు కొనుగోలు చేశారు, ఎన్ని కవర్లు వినియోగించారో నగర పాలక సంస్థ లెక్కతేల్చి వాటికి యూజర్‌ ఛార్జీలు వేయనుంది.

మరిన్ని వార్తలు