బెజవాడ రైల్వేకు ‘ఔటర్’ కష్టాలు

30 Jul, 2014 20:33 IST|Sakshi
బెజవాడ రైల్వేకు ‘ఔటర్’ కష్టాలు

హైదరాబాద్: ప్రత్యేక జోన్ రేసులో ఉన్న బెజవాడ రైల్వే డివిజన్‌కు ‘ఔటర్’ కష్టాలు తప్పడం లేదు. ఉత్తర, దక్షిణ భారతావనిలను కలిపే ప్రధాన జంక్షన్ అయిన విజయవాడ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాంలు ఖాళీ లేక గంటల తరబడి రైళ్లు శివార్లలో నిలిచి ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. పైగా ఔటర్‌లో రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అక్కడేదిగి పట్టాల మీద ఎదురుగా వచ్చే రైళ్లు ఢీకొని ప్రమాదాలకు గురై గడిచిన రెండేళ్లలోనే పదుల సంఖ్యలో మృత్యువాత పడిన సంఘటనలున్నాయి.

వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ గుర్తింపు పొందిన విజయవాడకు రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం(ఆర్‌ఆర్‌ఐ) ఏర్పాటు కాకపోవడమే ప్రధాన అవరోధంగా నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడను కేంద్రంగా చేసుకుని పలు కార్యాలయాలు ఇక్కడ్నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పైగా 13 జిల్లాల నుంచి ఇటీవలి కాలంలో విజయవాడకు రద్దీ పెరిగింది. రైళ్ల ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. అయితే స్టేషన్‌లో ఆర్‌ఆర్‌ఐ సిస్టం ఏర్పాటు కాకపోవడంతో చెన్నై, హైదరాబాద్, వైజాగ్ రూట్ల నుంచి వచ్చే రైళ్లను ‘ఔటర్’లోనే గంటల కొద్దీ నిలిపేస్తున్నారు.

క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో చెన్నై మార్గంలో కృష్ణాకెనాల్ వద్ద, హైదరాబాద్, వైజాగ్‌ల నుంచి వచ్చే రైళ్లను రాయనపాడు వద్ద గంటల తరబడి నిలుపుతూ ప్రయాణికులకు నరకం చూపిస్తున్నారు. గత కృష్ణా పుష్కరాలకు రూ.7 కోట్ల వ్యయంతో ఆర్‌ఆర్‌ఐ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా తారాపేట టెర్మినల్ వైపు నం.8, 9, 10 ప్లాట్‌ఫాంలు నిర్మించారు. వీటిపై ప్రస్తుతం ట్రాఫిక్ వన్‌వే గానే ఉంది. దశాబ్దానికి పైగా ఈ పనులు చేపట్టకపోవడంతో నేటికీ ఆర్‌ఆర్‌ఐ పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. అంచనా వ్యయం మాత్రం అంతకంతకు పెరిగి ఇప్పుడు రూ.70 కోట్లకు పైగా చేరింది.

విజయవాడ డివిజన్ నుంచి గూడ్సు రవాణా, ప్రయాణికుల రైల్వే చార్జీలు కలిపి వార్షికాదాయం రూ. 3 వేల కోట్లకు పైగా ఉంది. దేశంలోనే ఆదాయంలో విజయవాడ రెండో స్థానంలో ఉన్నా, ఇక్కడ వసతుల కల్పనలో మాత్రం రైల్వే బోర్డు వివక్ష చూపుతూనే ఉంది. ఆర్‌ఆర్‌ఐ క్యాబిన్ ఏర్పాటుకు కీలకమైన కృష్ణాకెనాల్ వద్ద ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఓ ‘పాయింట్’ ఏర్పాటుకు రైల్వే బోర్డు నుంచి అనుమతులు రావడం లేదంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది.

త్వరలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు జరగనున్నాయి. ఈ దఫా మహాకుంభ మేళా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. ఈలోగానైనా రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే ‘ఔటర్’ కష్టాలు తప్పుతాయి.
 

మరిన్ని వార్తలు