సమర స్ఫూర్తి

15 Apr, 2016 03:36 IST|Sakshi

రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యం
అమర్‌నాథ్ నిరవధిక దీక్ష {పారంభం
పార్టీలు, ప్రజా సంఘాల సంఘీభావం
భారీ ర్యాలీలో హోరెత్తిన జోన్ నినాదాలు
పాలకుల నిర్లక్ష్య ధోరణిపై  ఆగ్రహ జ్వాలలు
ఫోన్ చేసి భరోసా ఇచ్చిన  వై.ఎస్.జగన్

 

భానుడి భగభగలను తలదన్నేలా ఉద్యమస్ఫూర్తి రగిలింది.. రైల్వే జోన్ కోసం నేను సైతం.. అంటూ నినదించింది. ఉక్కు సంకల్పం.. సమర దీక్షగా మారింది. పోరాడితే పోయేదేం లేదు.. రైల్వే జోన్ సాధించడం తప్ప.. అన్నట్లు వేల గొంతుకలు ఒక్కటై జోన్ దీక్షకు జై కొట్టాయి. పదం పదం కలిపి ర్యాలీగా అడుగులు కదిపి దీక్షాస్థలికి చేరుకున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాల దీప్తి.. దివంగత మహానేత వైఎస్ పోరాట స్ఫూర్తి.. సీఎస్ రావులాంటి పెద్దల ఆశీస్సులు తోడుండగా అమర్‌నాథ్ నిరవధిక దీక్షకు అంకురార్పణ జరిగింది. రాజకీయాలకతీతంగా సంఘీభావం కొండంత అండగా నిలిచింది.


విశాఖపట్నం   మండుటెండ మంటపెడుతున్నా లెక్క చేయకుండా రైల్వే జోన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. విశాఖకు రైల్వేజోన్ సాధనే ఏకైక లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ గురువారం ప్రారంభించిన నిరవధిక దీక్షకు ఉత్తరాంధ్ర నుంచి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు వెంటరాగా  అమర్‌నాథ్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి వేలాదిమందితో భారీ ర్యాలీగా జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షా వేదికకు చేరుకున్నారు. రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు ఆశీర్వాదం తీసుకుని ఉదయం 11గంటలకు అమర్‌నాథ్ దీక్ష చేపట్టారు.  సహజంగానే వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపాయి. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అమర్‌నాథ్‌కు ఫోన్ చేసి మరీ దీక్షకు పార్టీ వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ  సీనియర్‌నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు ఈ దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటించారు.

 
పార్టీ ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గిడ్డి ఈశ్వరి, వి.కళావతి, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డిశాంతి తదితరులు కూడా హాజరై మద్దతు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తిరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సిహెచ్. నర్సింగరావు, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీలతోపాటు పలు ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక, జర్నలిస్టు సంఘాలు, ఎన్జీవోలు కూడా ఈ దీక్షకు పూర్తి సంఘీభావం తెలపడం విశేషం.

 
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ముప్పేట దాడి

విశాఖ రైల్వేజోన్ ప్రకటించకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతున్న టీడీపీ, బీజేపీలపై ఈ దీక్షలో వక్తలు విరుచుకుపడ్డారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధి లోపానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడంపై ఉన్న శ్రద్ధ సీఎం చంద్రబాబుకు రైల్వేజోన్ సాధన మీద లేదని మండిపడ్డారు. దీక్షకు సంఘీభావం ప్రకటించమని కోరినప్పటికీ టీడీపీ, బీజేపీలు ఎందుకు ముఖం చాటేశాయని పలువురు వక్తలు నిలదీశారు.

 
గుడివాడ అమర్‌నాథ్ చేపట్టిన దీక్షకు భారీ సంఖ్యలో వివిధ పార్టీల నేతలు, ఇతర వర్గాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు, వైఎస్సార్ కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్తలు కోలా గురువులు, వంశీకృష్ణ శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, ఉమాశంకర్ గణేష్, రాష్ట్ర గిడ్డంగులు సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, సీఈసీ సభ్యులు దామా సుబ్బారావు, శ్రీకాంత్ రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోకు, రాష్ట్ర పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, పార్టీ మహిళా విభాగం ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఉషాకిరణ్, షరీఫ్, వాసు, బోని శివరామకృష్ణ, బదరీనాథ్, రాధ, తిప్పల వంశీ, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు, పార్టీ నేతలు రొంగలి జగన్నాథం, అల్ఫా కృష్ణ, తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, నిర్మలా రెడ్డి, పరదేశీ, హేమంత్‌కుమార్‌లతోపాటు పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, నగర కార్యదర్శి గంగారామ్, సీపీఐ నగర కార్యదర్శి స్టాలిన్, లోక్‌సత్తా భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియర్ జోనల్ అధ్యక్షుడు చలసాని గాంధీ, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక కన్వీనర్ శివశంకర్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు వర్మ తదితరులు దీక్షకు సంఘీభావం ప్రకటించారు.

మరిన్ని వార్తలు