మమ్మల్ని ఏఎస్‌ఓలుగానే కొనసాగించాలి

22 Apr, 2015 00:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఏపీపీఎస్సీ 1999 గ్రూప్2 నియామకాల్లో ఏఎస్‌ఓలుగా నియమితులై సచివాలయంలో కొనసాగుతున్న తమను యథాతథంగా కొనసాగించాలని అసిస్టెంటు సెక్షన్ ఆఫీసర్లు (ఏఎస్‌ఓ) ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీకి పంపాలని కోరారు. మంగళవారం సచివాలయంలోని 40 మంది ఎఎస్‌ఓలు సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలుపై అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఏఎస్‌ఓలు తెలిపారు.

ఈ నియామకాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో తమ సమ్మతి పత్రాలను ఏపీపీఎస్సీ అడిగిందని వారు వివరించారు. తాము ఎక్కువ మార్కులు కలిగి ఉన్నందున ఎగ్జిక్యూటివ్ లు, ఏఎస్‌ఓలుగా రెండింటికీ అర్హులమేనని చెప్పారు. కాకపోతే ఏఎస్‌ఓలుగా 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నందున తమకు ఎక్కువ మార్కులు ఉన్నా కూడా ఇదే పోస్టులో కొనసాగాలని కోరుకుంటున్నామని తెలిపారు. తమ సమ్మతి పత్రాలను తీసుకోవడం ద్వారా ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో పనిచేస్తున్న 973 మందికి మేలు జరుగుతుంద న్నారు.
 

మరిన్ని వార్తలు