మా బిడ్డను కాపాడండి

27 Feb, 2018 11:15 IST|Sakshi
ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు

ఐదు నెలల బాబుకు కాలేయ సమస్య

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

సహాయం చేయాలని వేడుకోలు  

సీతానగరం (రాజానగరం) : నవమాసాలు మోసి, కన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని.. బోసి నవ్వులతో.. ఇంట ఆనందాల జల్లులు కురిపించి, మురిపించి, తమ కష్టాలను మరిపించాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ, పుట్టిన ఐదు నెలలకే ప్రాణాంతక వ్యాధి బారిన పడితే వారి కన్నీటికి అంతే ఉండదు. ఇలాగే తల్లడిల్లిపోతున్నారు సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన గోసంగి వీరవెంకట సత్యనారాయణ, కోటీశ్వరి దంపతులు. వారికి ఐదు నెలల కిందట ఓ కుమారుడు పుట్టాడు. మూడు నెలల వరకూ బిడ్డ ఆరోగ్యంగానే ఉండేవాడు. 

అతడికి తెల్లగా మల విసర్జన అవుతుండడంతో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విజయవాడలో వైద్య పరీక్షలు చేయించగా.. తమ చిన్నారి కాలేయ సంబంధ సమస్యతో బాధ పడుతున్నాడని తెలిసి తీరని వేదనకు గురయ్యారు. బిడ్డను కాపాడుకొనేందుకు చెన్నై ఎగ్మోర్‌లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించారు. ఆ సందర్భంగా 28 రోజులు అక్కడే ఉన్నారు. ఆ బిడ్డకు కాలేయం దెబ్బ తిందని, దానిని మార్చాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదమని అక్కడి వైద్యులు చెప్పారు. కొడుకును కాపాడుకొనేందుకు తన లివర్‌ ఇవ్వడానికి తండ్రి సత్యనారాయణ ముందుకు వచ్చాడు. సంబంధిత శస్త్రచికిత్స కోసం ఈ నెల 12న హైదరాబాద్‌లోని గ్లేన్‌ ఈగల్స్‌ గ్లోబల్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు.

ఇందుకు రూ.25 లక్షలు అవుతుందని వారు తెలిపారు. అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక.. ఈ నెల 20న ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.15 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన రూ.10 లక్షలూ ఎక్కడి నుంచి తేవాలో తెలీక వారు తల్లడిల్లిపోతున్నారు. కూలి పనికి వెళ్తేనే కానీ పూట గడవని తమకు అంత ఖరీదైన శస్త్రచికిత్స చేయించే స్తోమత లేదని, దాతలు ముందుకు వచ్చి మిగిలిన రూ.10 లక్షలూ సమకూర్చి, తమ కుమారుడికి ఆయుష్షు పోయాలని సత్యనారాయణ, కోటీశ్వరి కోరుతున్నారు. మానవత్వంతో స్పందించేవారు 99 515 46 396 నంబర్‌లో తమను సంప్రదించాలని వారు కోరారు. 

మరిన్ని వార్తలు