మా నాన్నకు జీతం పెంచండి

6 Mar, 2018 10:20 IST|Sakshi
ప్లకార్డులతో దీక్షల్లో పాల్గొన్న  విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల భార్యా పిల్లలు

విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు ‘కరెంటోళ్ల దీక్షలు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల పిల్లలు, కుటుంబసభ్యులు కూడా ఈ దీక్షల్లో పాల్గొన్నారు. ‘మా నాన్నకు జీతం పెంచండి’ అని రాసిన ప్లకార్డులతో చిన్నారులు ఆందోళనలో పాల్గొనటం గమనార్హం.

ఎస్‌వీఎన్‌ కాలనీ(గుంటూరు) : న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారానికి 14వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలెక్టరేట్‌ రోడ్డులో రహదారిపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు. ధర్నా శిబిరంలో భార్యా, పిల్లలతో కలిసి కాంట్రాక్ట్‌ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ నరసింహారావు మాట్లాడుతూ 14 రోజులుగా విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు సమ్మె చేస్తున్నా యాజమాన్యాలుగాని, ప్రభుత్వంగాని స్పందించకపోవడం శోచనీయమన్నారు.

ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన విజయవాడలోని విద్యుత్‌ సౌధ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. స్పందన రాకుంటే 10న రహదారుల దిగ్బంధం, 12న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. సీఐటీయూ  నాయకులు పోపూరి సుబ్బారావు, హుస్సేన్‌వలి, కాంగ్రెస్‌ నేత వినయ్‌కుమార్, సీపీఎం జిల్లా నాయకులు పాశం రామారావు, ఓబీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, యూనియన్‌ నేతలు శివకుమారి, షకీలా పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు