మమ్మల్ని కలపండి ప్లీజ్!

17 Jun, 2014 02:32 IST|Sakshi
మమ్మల్ని కలపండి ప్లీజ్!

కోనమసివానిపాలెం(లక్కవరపుకోట):ఆ గ్రామం పేరు కోనమసిపాలెం. అక్కడ అం తా అయోమయం. గజిబిజి గందరగోళం. తమ్ముడు ఒక మండలంలో ఉంటే అన్న వేరే మండలంలో ఉంటాడు. ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో అసలు తెలీదు. ముప్పై ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్లుగా స్థానికులు అధికారులకు అధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వారి సమస్యను పట్టించుకోలేదు. లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామంలో ఐదు వందల ఇళ్లున్నాయి. దాదాపు 2,500 మంది జనాభా ఉన్నారు. 1976-77లో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయతీను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో కలిపారు. అక్కడే అసలు సమస్య ఏర్పడింది.
 
 గ్రామం ఒక్కటే అయినప్పటికీ ప్రజలను రెండు పంచాయతీలు, రెండు మండలాల్లో కలిపారు. దీంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో స్థానికులకు కూడా అయోమయంగా ఉంది. వారికి అవసరమైన ధ్రువపత్రాలను ఏ మండలంలో తీసుకోవాలో కూడా తెలీకుండా వారు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఏ పంచాయతీలో ఓటు వేయాలో కూడా తెలీదు. గ్రామంలో ఒక వీధి అవతల భాగం కొత్తవలస మండలం దేవాడ పంచాయతీ శివారు కోనమసివానిపాలెం గ్రామంగా, మరొక వైపు లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం పంచాయతీగా గుర్తింపు ఉంది.
 
 అన్నీ రెండేసే...
 కోనమసివానిపాలెం గ్రామం ఒక్కటే కాగా ప్రభుత్వ కార్యాలయాలు రెండేసి ఉన్నాయి. రెండు అంగన్‌వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. అలాగే రెండు పంచాయతీ భవనాలు కూడా ఉన్నాయి. వృథా అవుతున్న ప్రజాధనంగ్రామంలో అన్నీ రెండేసి ఉండడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడినంత విద్యార్థులు లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గ్రామాన్ని ఒక పంచాయతీగా చేసి ఒకే మండలానికి చెందినదిగా చేయాలని స్థానికులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు.
 

మరిన్ని వార్తలు