మీరైనా కరుణించండి..

15 Jul, 2014 02:14 IST|Sakshi
మీరైనా కరుణించండి..

 కర్నూలు రూరల్: నెలల తరబడి కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నాం. సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. అదిగో..ఇదిగో అంటూ అధికారులు తప్పించుకుని తిరుగుతున్నారు. కొత్తగా వచ్చిన మీరైనా మాపై దయ ఉంచి అపరిష్కృత సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని ప్రజలు కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్ విజయమోహన్‌ను కోరారు.

సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయమోహన్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు, ఏజేసి అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వేణుగోపాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ రామసుబ్బులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న సుదర్శన్‌రెడ్డి బదిలీ అయిన విషయం విదితమే.
 
 ఆయన నుంచి బాధ్యతలు తీసుకున్న కొత్త కలెక్టర్ విజయమోహన్ జిల్లా అధికారులతో పరిచయ కార్యక్రమం పెట్టుకోవడంతో ప్రజాదర్బార్ సుమారు గంటన్నర పైగా ఆలస్యంగా మొదలైంది. సమస్యలపై వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారితో సునయన ఆడిటోరియం నిండిపోయింది. రెవెన్యూ అధికారులు కాస్త దృష్టి పెడితే ఆర్థిక అంశాలతో పాటు, న్యాయబద్ధమైన సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

అయితే అధికారులు జాప్యం చేయడంతో ఏదో ఒక రోజు  సారోళ్లు స్పందించకపోరా అనే ఆశతో ప్రజలు ప్రతి వారం అర్జీలు చేతపట్టుకొని జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసలు కోర్చి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టర్ వచ్చాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు చేరుకొని తమ సమస్యలు ఏకరువు పెట్టారు. అయితే అధికారులు వినతులను తీసుకుంటున్నారే తప్ప ఎలాంటి పరిష్కార మార్గాలు చూపకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు.
 
వితంతు పింఛన్ కోసం ఆరేళ్లుగా తిరుగుతున్నా... - శకుంతలమ్మ, గోనెగండ్ల
నా భర్త రంగప్ప 2008వ సంవత్సరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వితంతు పింఛన్ కోసం మండల, జిల్లా కేంద్రంలో జరిగే ప్రజాదర్బార్ కార్యక్రమాలకు ఆరేళ్లుగా తిరుగుతున్నా. ఇప్పటికి 20కి పైగా వినతులు ఇచ్చాను. అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు వ్యక్తులు పింఛన్ ఇప్పిస్తామని చెప్పి డబ్బులు కూడా తీసుకున్నారు. కొత్త కలెక్టరైనా పింఛన్ ఇప్పిస్తారనే ఆశతో వచ్చాను.
 
ప్రభుత్వ భూములు ఇచ్చి ఆదుకోవాలి...
బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామానికి చెందిన దళిత మహిళలు ప్రభుత్వం భూమి ఇచ్చి ఆదుకోవాలని కోరుతూ ప్రజాదర్బార్‌లో వినతులు ఇచ్చారు. సర్వే నంబర్లు 771/1, 772/1, 773/3లలో మొత్తం 15 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమి ఉందని, అయితే ఆ భూమి నంద్యాల మండలం శాబోలు గ్రామానికి చెందిన వ్యక్తుల ఆధీనంలో ఉందని అధికారుల దృష్టికి తెచ్చారు. మా గ్రామం పరిధిలో ఉన్న భూమి మాకే ఇప్పించాలని కలెక్టర్ విజయమోహన్‌కి వినతి పత్రం అందజేశారు.

మరిన్ని వార్తలు