ఆనందం పంచి.. విషాదం మిగిల్చి!

27 Feb, 2016 02:55 IST|Sakshi
ఆనందం పంచి.. విషాదం మిగిల్చి!

పుట్టిన రోజు సంతోషమే వేరు. ఆ పిల్లాడికీ అంతే. తెల్లవారగానే జేబు నిండా చాక్లెట్లు.. మంది నిండా ఉత్సాహంతో పరుగున పాఠశాలకు చేరుకున్నాడు. స్నేహితులు, ఉపాధ్యాయులకు ఆనందం పంచిపెట్టాడు. బెల్లు మోతతో ఒక్క ఉదుటున బయటపడ్డాడు. రద్దీప్రయాణికులతో వస్తున్న బస్సు తనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుందని ఊహించలేకపోయాడు. త్వరగా ఇంటికి చేరుకోవాలనే తాపత్రం ఆ విద్యార్థిని కబళించింది.
 
 
బస్సు కింద పడి విద్యార్థి మృతి
ఉదయం పాఠశాలలో పుట్టిన రోజు సంబరం
సాయంత్రం త్వరగా ఇల్లు చేరుకోవాలనే తాపత్రయం
రద్దీ నేపథ్యంలో బస్సెక్కబోయి జారిపడిన వైనం
ఏపీ మోడల్ స్కూల్‌లో విషాదం

 
ఎమ్మిగనూరు రూరల్:  కడిమెట్లకు చెందిన మహమ్మద్, ఖాజమ్మ దంపతులకు మహబుబ్, ఉసేని సంతానం. ఇద్దరూ మండల పరిధిలోని కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్‌లో చదువుకుంటున్నారు. మహబూబ్ 7వ తరగతి కాగా.. ఉసేని(11) 6వ తరగతి. శుక్రవారం పుట్టిన రోజు కావడంతో ఉసేని స్కూల్‌లో స్నేహితులు, ఉపాధ్యాయులకు చాక్లెట్లు పంపిణీ చేశాడు. సాయంత్రం స్కూల్ వదలిన తర్వాత వచ్చిన ఆర్టీసీ బస్సు(ఏపీ28 జెడ్2564) ఎక్కేందుకు పరుగుతీశాడు. అప్పటికే బస్సు రద్దీగా ఉండటం, కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డుపై వేలాడుతున్నా త్వరగా ఇల్లు చేరుకోవాలనే ఆత్రుతతో తనూ ఎక్కే ప్రయత్నం చేశాడు.

మరో ఇద్దరు విద్యార్థులు కూడా అదే ప్రయత్నం చేయబోగా ముగ్గురూ కిందపడిపోబోయారు. సీనియర్ విద్యార్థులు ఇద్దరిని కాపాడగా.. ఉసేని నడుము పైనుంచి బస్సు టైరు ఎక్కింది. తీవ్ర గాయాలైన విద్యార్థిని ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు 108 అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ కృష్ణయ్య తన సుమో వాహనంలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. అయితే ఉసేని మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆసుపత్రిలో కుటుంబీకులను పరామర్శించారు.


 526 మంది విద్యార్థులకు మూడు బస్సులు
కడివెళ్ల ఏపీ మోడల్ స్కూల్‌లో ఆరు నుంచి ఇంటర్మిడియట్ వరకు 526 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు 5 ఆర్టీసీ బస్సులు అవసరం కాగా.. ప్రస్తుతం మూడింటినే పంపుతున్నారు. గతంలో ఒకే బస్సు వచ్చేది.. అప్పడు బస్సు టాప్ పైనుంచి విద్యార్థి కింద పడి కాలు విరిగింది. సాయంత్రం ఒక బస్సు 4.30 తర్వాత వస్తుండటంతో విద్యార్థులు త్వరగా ఇంటికి చేరుకోవటానికి ఎగబడతున్నారు. మరో రెండు బస్సులు 5 గంటలకైనా రావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ మూడు బస్సుల్లో విద్యార్థులు అతి కష్టం మీద ఇళ్లకు చేరుకుంటున్నారు. బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ అధికారులను పలుమార్లు కోరినా పట్టించుకోవడం లేదని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు చెప్పారు.

మరిన్ని వార్తలు