ఆనందాల లోగిళ్లు

13 Jan, 2014 01:23 IST|Sakshi
ఆనందాల లోగిళ్లు

ఆనందాల లోగిళ్లు
 
పల్లెల వాకిళ్లలో ఆనందాల రంగవల్లులు కళకళలాడుతున్నాయి. సంబరాల భోగి మంటలు అనుబంధాల వెచ్చదనాన్ని పంచి ఇస్తున్నాయి. గొబ్బిళ్లలో విరిసిన బంతి పూలు చిన్నారుల దరహాసాల్లా కాంతులీనుతున్నాయి. కుటుంబాలతో తరలివచ్చిన కొడుకులు, కూతుళ్ల కోలాహలాన్ని తిలకించిన తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాల సిరులు రాశుల్లా వెల్లివిరుస్తున్నాయి. పలకరింపులు, పరాచకాలు, పరవశాలతో పల్లెల్లో వీధివీధీ ప్రతిధ్వనిస్తున్నాయి. గంభీరంగా తల ఊచే గంగిరెద్దు ఆశీస్సులతో ఇళ్లన్నీ ఆనందాల లోగిళ్లుగా అవతరిస్తున్నాయి.
 
కొలువుతీరిన ‘అగ్రహారం’

కె.కోటపాడు రూరల్, న్యూస్‌లైన్ : మండలంలో ఆర్.వై.అగ్రహారంలో పలు కుటుంబాలు కలిసిమెలసి ఉంటున్నాయి. రాన్రాను ఇక్కడి కుటుంబాల్లో వారు ఉన్నత ఉద్యోగాల పేరిట హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వృత్తిరీత్యా పై ప్రాంతాల్లో ఉన్న వీరంతా సంక్రాంతి పండుగకు రెండ్రోజులు ముందుగానే గ్రామానికి చేరుకొని పండగను ఘనంగా చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్.వై.అగ్రహారంలోని నేమాని వెంకటేశ్వరశర్మ, మండ మల్లికార్జునరావు, రమణమూర్తి కుటుంబసభ్యులు గ్రామానికి చేరుకోవడంతో ఈ కుటుంబాల బంధుగణమంతా ఒకేచోటకు చేరుకొని కబుర్లుతో మునిగితేలారు. కుటుంబ పెద్ద నేమాని వెంకటేశ్వరశర్మ ఆనందం ఆయన మాటల్లోనే...
 ‘నా కుమారుడు మల్లిఖార్జున్‌కు ఇటీవలే వివాహం అయ్యింది. వీరు కువైట్‌లో ఉంటున్నారు. పండగ సందర్భంగా ఇంటికి రావడం చెప్పలేని ఆనందం కలిగించింది. ఇంటిల్లిపాదికి వస్త్రాలను విజయనగరం నుంచి కొనుగోలు చేసి తేవడం జరిగింది. మా బావ గారు వివి రమణమూర్తి  విశాఖపట్నంలో ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నాం. పిల్లలు  పెద్దలు సందడిగాా తిరుగుతూ ఉంటే మాకు నిజమైన పండుగ. పల్లెలో సంక్రాంతి పండుగ సంప్రదాయబద్దంగా ఉంటుంది. అందుకే ఏటా ఇక్కడే మాకు పండగ...’ అని వివరించారు శర్మ.

దరి చేర్చిన అనుబంధం
 
చోడవరం టౌన్, న్యూస్‌లైన్ : పొట్ట చేత పట్టుకుని దేశాలు దాటినా అనుబంధాలు మాత్రం వీడిపోవు....ఏళ్లయినా...దశాబ్దాలైనా రక్త సంబంధం గుండె తలుపు తడుతుంది. పండగకు రమ్మంటుంది.... ఆత్మీయత కురిపిస్తుంది...దీనికి ఈ కుటుంబమే నిదర్శనం. ‘సంక్రాంతి పండుగ అంటేనే మా ఇంట్లో సందడి నెలకొంటుంది. చోడవరం ఎప్పుడు వస్తామా అని ఒక్కటే సరదా.... 20 ఏళ్ల క్రితం అస్సాంలో స్థిరపడ్డాం... అప్పట్నుంచీ ప్రతి ఏటా సంక్రాం తికి కుటుంబంతో సహా సంక్రాంతికి వస్తాం... బంధువులందరినీ కలుసుకొని పండుగ అనంతరం తిరిగి అస్సాం వెళ్లిపోతాం...’ అంటూ పాతాళం చిలకమ్మ, ఆమె పెద్ద కుమారుడు పాతాళం రాము, చిన్న కుమారుడు శ్రీనివాస్ తెలిపారు. చోడవరంలోని కో ఆపరేటివ్ కాలనీకి చెందిన పాతాళం దుర్గాప్రసాద్ ఇంట్లో బంధువులు సందడి చేశారు.   ఉద్యోగరీత్యా రాము ఇండియన్ టుబాకో కంపెనీలోను, శ్రీనివాస్ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలోను ఉంటున్నారు. వీరంతా భార్యాపిల్లలతో ప్రతి ఏటా తన తమ్ముడు దుర్గాప్రసాద్ ఇంటికి సంక్రాంతి పండగకు వచ్చి ఆనందం, ఆత్మీయతలు పంచుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఇంట సంక్రాంతి సందడి చేస్తోంది.
 
 సొంతూరులోనే సంక్రాంతి

 పాడేరు, న్యూస్‌లైన్ :  పొట్ట చేత పట్టుకుని వలసపోయినా...సొంతూరులో సంక్రాంతి పండగను మాత్రం వారు మరిచిపోలేదు. పేద కుటుంబమైనా  ఏటా ఈ పెద్ద పండగను ఘనంగా జరుపుకొంటారు. పండగ మూడు రోజులూ గ్రామంలో సరదాగా గడిపి తిరిగి కూలికెళ్లిపోతారు. ఏటా ఈ పండగ తమ బతుకుల్లో కొత్త వెలుగు నింపుతుందని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు...గన్నేరుపుట్టు గ్రామానికి చెందిన మఠం బొంజుబాబు. ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే... ‘సొంతూరులో పండగ చేసుకోవడం నాకెంతో సంతోషం. భార్య, కొడుకులు, కోడలు, మనవరాళ్లతో కలిసి గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కొల్లిపొర గ్రామానికి వలస పోయాను. అక్కడ కోళ్లుఫారంలో కుటుంబమంతా పనిచేస్తున్నాం. సంక్రాంతి పండగతో సొంతూరైన గన్నేరు పుట్టు వచ్చాం. పేద కుటుంబమైనప్పటికీ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. బంధువులకు కూడా స్థోమతకు తగ్గట్టూ కొత్త బట్టలు తీశాం.  మా కుటుంబం పండగకి గ్రామానికి రావడంతో సాటి గిరిజనులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు..మేం కూడా మిగతా బంధువులందరిని ఇంటికి పిలిచి సంక్రాంతికి కడుపునిండా భోజనం పెడతాం. పండగ రోజులు వారితోనే సరదాగా గడుపుతాం.

అందరూ కలిస్తే...చిన్ననాటి ముచ్చట్లే

 అనకాపల్లి, న్యూస్‌లైన్ : ఆ ఇంట కుటుంబమంతా కలిస్తే పండగే. అందులోనూ పెద్ద పండగ వస్తే...చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకుంటారు... ‘మా చిన్నప్పుడు సంక్రాంతి వస్తే...ఓహో... హరిదాసులు, తప్పెటగుళ్లు, తీర్థాలు’ అని నెమరవేసుకుంటూ రిటైర్డ్ తెలుగు లెక్చరర్ కొట్టె కోటారావు తన కుటుంబీకులకు సంక్రాంతి పర్వదినాన్ని నేపధ్యాన్ని వివరించారు. పెద్ద పండగ నేపథ్యంలో ఆ ఇంట తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ పిల్లాపాప, పెద్దలు నవ్వులు చిందించారు. కొత్తూరు పంచాయతీ పరిధిలోని ఎస్‌బీఐ క్వార్టర్స్‌లో నివసిస్తున్న కోటారావు ఏఎంఏఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తునికి సమీపంలోని తేటగుంట పరిధిలోని తిమ్మాపురం వాసియైన కోటారావు తన చిన్నప్పుడు సంక్రాంతి వస్తే వారం రోజుల ముందు నుంచే హడావుడి చేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఆయన పెద్ద కుమారుడు శ్రీకాంత్ ఒరిస్సా సరిహద్దులోని ఒనకఢిల్లీ వద్ద తెలుగు మాస్టార్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమారుడు రాజేష్ స్థానికంగా ఒక ప్రైవేటు పాఠశాలలోపనిచేస్తున్నారు. అల్లుడు కొవ్వూరులో తెలుగు మాస్టార్‌గా పనిచేస్తున్నారు. వీరంతా పండగకు ఒక్కచోట చేరారు. కోటారావు దంపతులు, కుమారులు, కోడళ్లు, కూతురు, అల్లుడు, సోదరి, మనుమడు, మనుమరాలితో సంక్రాంతి కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోయారు. పండగనాడు దేవాలయానికి, కాసింత సేదదీరేందుకు పార్కుకు వెళతామని కోటారావు చెబుతూ వారి సంక్రాంతిలో ఎలా గడుపుతారో వివరించారు.
 
జవాను ఇంట వేడుక
 
తగరపువలస రూరల్, న్యూస్‌లైన్ : ‘సంక్రాంతి పండగ మాకు వెలుగు నింపడానికి కారణం మా అబ్బాయి బాలు. ఆర్మీ నుండి సెలవులపై ఇంటికి రావడంతోనే మా ఇంటికి కళ వచ్చింది... ఇంటిల్లిపాది సంతోషంగా ఉన్నాం...’ అంటున్నారు.. భీమునిపట్నం రూరల్ మండలం పాత మూలకుద్దుకి చెందిన ఓ ఆర్మీ ఉద్యోగి బాలు కుటుంబ సభ్యులు బోర రమణమ్మ, సంతోషి. బాలు ఆరు నెలలు క్రితం ఉద్యోగానికి వెళ్లాడు. పండగకి సెలవులో వస్తాడనుకోలేదు...అతను ఆదివారం రావడంతోనే మా ఇంటికి కళ వచ్చింది. పండగ సందడి, పిండి వంటలు ప్రారంభమయ్యాయి...బాలు లేకపోతే అన్నీ ఉన్నా పండగ సందడి మాత్రం ఉండేది కాదు...అని ఆనందం వ్యక్తం చేశారు. ‘నాకు ప్రస్తుతం సెలువు దొరుకుతుంది అనుకోలేదు....దేవుడి దయ వల్ల సెలవు దొరికింది...నా కుటుంబ సభ్యుల ఆనందం కోసమే ఈ పండగకు సెలవుమీద వచ్చాననని ఆర్మీ ఉద్యోగి బాలు తెలిపారు.
 
 బాంధవ్యాలు బలపడేలా...

 ఎస్.రాయవరం, న్యూస్‌లైన్ : పండగంటే ఇళ్లంతా బంధువులతో కళకళలాడాలి. ఏడాదికొక్కసారైనా కుటుంబ సభ్యులంతా కలుసుకోవాలి..అందుకే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, ఒక్కొక్కరుగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.. గుడివాడలో ఒక కుటుంబం ఇలా పండక్కి సొంతింట్లో గడిపేందుకు వచ్చారు.  పేరిచర్ల సత్యనారాయణరాజు దాదాపు ఎనిమిదేళ్లక్రితం విజయవాడలో వ్యాపారరీత్యా స్థిరపడ్డారు. అతని తమ్ముడు విశాఖలో వ్యాపారం చే స్తూ అక్కడే ఉంటున్నాడు... తమ సొంతూరు గుడివాడలో అమ్మనాన్న ఉంటున్నారు...ఇలా కుటుంబ సభ్యులంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నా...పెద్ద పండగకు మాత్రం ఒక్కచోట చేరతారు. అమ్మానాన్నల దగ్గరికి వస్తేనే వారికి పండగ. ‘మిగతా పండగల్లో మాత్రం ఎవరికి వీలుంటే వారు వచ్చి అమ్మనాన్నలను పలకరించి వెళ్తుంటాం...సంక్రాంతినాడు మాత్రం అందరం కలుసుకుంటాం. పిల్లలంతా ఆటపాటలతో మునిగితేలడం, కుటుంబమంతా ఒకే చోట కలసి భోజనాలు చేయడం, ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకోవడం చూస్తే అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. అంటూ తమ పండగ విశేషాలు చెప్పుకొచ్చారు సత్యనారాయణరాజు.
 
 కలసిమెలసి ఉంటే ఇంటింటా సంక్రాంతి

 నక్కపల్లి/నక్కపల్లిరూరల్,న్యూస్‌లైన్: ‘సొంతూరు కన్నతల్లిలాంటిదంటారు...ఎంతబిజీగా ఉన్నా, ఎన్ని వ్యాపకాలున్నా సంక్రాంతికి మాత్రం అందరం ఇక్కడ కలుసుకోవాల్సిందే...అని చినదొడ్డిగల్లుకు చెందిన బండారు గోవిందరావు తమ కుటుంబంలో సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. పెద్ద పండగ తమ కుటుంబంలో అనుబంధాలను ఎలా పెనవేస్తుందో తెలిపారు. ‘మా తల్లిదండ్రులకు ఇద్దరు మగ, ఇద్దరు ఆడ సంతానం. అన్నయ్య నర్సీపట్నంలో ఆర్‌టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. నేను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డాను, తోబుట్టువులకు పెళ్లిళ్లు చేశాం.. ఒక అక్క ఈ వూర్లోనే ఉంటోంది. మరోసోదరి  విశాఖలో ఉంటోంది. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. బెంగళూరులో స్థిరపడినా ఈ వూళ్లో సొంతిల్లు నిర్మించుకున్నాను. ప్రతి సంక్రాంతికి నేను, భార్య, పిల్లలు , చినదొడ్డిగల్లు వస్తాం, మాతోపాటు మా అత్త,మామగారిని మా సొంతవూరుకు ఆహ్వానిస్తాం. సంక్రాంతికి మూడురోజులు ముందుగానే చేరుకుంటాం. అన్నయ్య, వదిన పిల్లలు సాయంత్రానికి చేరుకుంటారు...రక్తసంబంధీకులతోపాటు, బందువులు,స్నేహితులతో ఉల్లాసంగా గడిపి పండగ అనంతరం ఎవరి పనుల్లో వారు బిజీఅవుతాం. అందుకే మిగతా పండగలకు పెద్దగా రాకపోయినా సంక్రాంతికి మాత్రం కచ్చితంగా అందరం కలుసుకోవాల్సిందే...’ అంటూ ఆనందంగా వివరించారు.
 
 పుట్టిల్లు పిలిచింది...
 రోలుగుంట, న్యూస్‌లైన్ : కలిసి చదువుకున్నారు...కలిసిమెలిసి పెరిగారు...పెళ్లిళ్లై అత్తారిళ్లకు వెళ్లారు..కన్నవాళ్లకు, కన్న ఊ రికి దూరమయ్యారు. కానీ ఆ అనుబం ధం విడిపోలేదు...ఏటా పుట్టింటి తలుపుతడుతుంది....ఆనందం పంచుకుంటుం ది. నేస్తాలను పలకరిస్తుంది. ఆ ఆనందానికి నిదర్శనమే ఈ స్నేహితులు, గ్రామానికి చెందిన పి.రోజాకుమారి విశాఖజిల్లా సబ్బవరంలోను, మావూరి తులసి విజయనగరంలోను, జి.మణి తూర్పు గోదావరి జిల్లా తునివలస లో, ఎస్.రామలక్ష్మి హైదరాబాద్‌లోను వివాహాలు చేసుకొని అక్కడ ఉంటున్నారు.  వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామం వచ్చారు.  అందరూ కలిసి స్థానిక శ్రీ విజ్ఞాన్ కాన్వెంట్ వద్దకు వచ్చి కలుసుకున్నారు...చిన్ననాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు...ప్రతి సంక్రాంతి ఇలాగే ఆనందం పంచాలని, ఏడాదికొక్కసారైనా ఇలా కలుసుకోవాలని కోరుకున్నారు.  
 
 ఆనందం తలుపుతట్టిన వేళ...
 నర్సీపట్నం/గొలుగొండ, న్యూస్‌లైన్ : ఎక్కడెక్కడో పట్టణాల్లో జీవి స్తున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా ఒక్కసారే కలిసేది పెద్ద పండగకే.. పండగ మూడు రోజులూ ఇళ్లంతా సందడితో ఆనందంగా గడపడం ఆనవాయితీ... మనుమలు, మనుమరాళ్లతో తాతలు ఆడి పాడుకునే సరదా పండగ ఈ సంక్రాంతి... అందుకే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలకు ప్రీతైన పండగ ఇది...
 
 కుటుంబమంతా కలిసేది ఇప్పుడే
 సంక్రాంతి పండగ కుటుంబ సభ్యు లు, బంధుమిత్రులతో ఆనందంగా గడుస్తుంది. ప్రతి ఏటా కూతు రు, అల్లుడు, కొడుకులు, కోడళ్లు, మనుమలు, మనుమరాళ్లు వస్తారు. పండగ మూడు రోజులు సందడిగా ఉంటుంది. వివిధ రకాలైన పిండి వంటలు చేసి ఆనందంగా గడుపుతాం. ప్రతి ఏటా అందరూ ఒకేసారి కలిసేది ఈ పండక్కే. మూడు రోజులూ మనుమలు, మనుమరాళ్లతో కలిసి పట్టణంలో జరిగే తీర్థాలకు వెళతాను. అయ్యప్పస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమాలను కుటుం బమంతా కలిసి వీక్షించి సంతోషంగా గడుపుతాం.
 -పసుపులేటి విలాసకుమారి, బీసీ కాలనీ, నర్సీపట్నం
 
 సందడంతా మనవళ్లతోనే
 నాకు ఇద్దరు కుమారులు. నా కొడుకు, కూతుళ్లు, మనవళ్లతో పాటు చెల్లెల పిల్లలు అంతా కలిసి భోగి ముందు రోజుకే చేరుకుంటారు. కుటంబ మంతా కలిసి మూడు రోజుల పాటు జరిగే భజన కార్యక్రమాల్లో పాల్గొంటాం. గ్రామంలో జరిగే తీర్థానికి అంతా కలిసి వెళ్లి పిల్లలకు కావాల్సిన చిన్న చిన్న వస్తువులను కొని వారికిస్తుంటాను. వారి ఆనందం చెప్పనలవి కాదు...ఈ పండగ సందడంతా పిల్లలతోనే.         
-సుర్ల అచ్చియ్యనాయుడు
 చీడిగుమ్మల, గొలుగొండ

మరిన్ని వార్తలు