ప్రమాదాల నివారణకు ప్రతినబూనాలి

26 Jan, 2015 04:07 IST|Sakshi
ప్రమాదాల నివారణకు ప్రతినబూనాలి

డీఎస్పీ రామచంద్ర
 
కర్నూలు రాజ్‌విహార్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిన అవసరం ఉందని కర్నూలు ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర అన్నారు. 26వ రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు కొత్త బస్టాండ్‌లోని రిజర్వేషన్ కౌంటరు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో డ్రైవర్లుగా పని చేయడం గర్వకారణమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

కార్మికులు మద్యం, గుట్కా వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు మద్యం, ఇతర మత్తు పానియాలు సేవిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమన్నారు. విధులకు హజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకోవడంతో పాటు ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. బస్సులు నడిపేటప్పుడు ఏకాగ్రత చాలా అవసరమని ఆర్టీసీ రీజినల్ మేనేజరు కృష్ణమోహన్ అన్నారు.

విధులకు హాజరయ్యే ముందు తగిన విశ్రాంతి తీసుకుంటే మానసిక ఉల్లాసంగా ఉంటుందన్నారు. విధుల్లో ఉన్న ప్రతి డ్రైవరు తన బస్సులో ఉన్న ప్రయాణికుల సంక్షేమాన్ని మరవరాదన్నారు. డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు రామం, డిప్యూటి చీఫ్ మెకానికల్ ఇంజినీర్ శ్రీనివాసులు, కర్నూలు-1 డిపో మేనేజరు మనోహర్, బస్‌స్టేషన్ ఏటీఎం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రమాదాల నివారణపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులిచ్చి అభినందించారు.

మరిన్ని వార్తలు