ఓవర్‌ టు స్ట్రాంగ్‌ రూమ్స్‌

13 Apr, 2019 13:35 IST|Sakshi
బందరు కృష్ణా వర్సిటీలో స్ట్రాంగ్‌ రూమ్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్, ఎస్పీ త్రిపాఠి

ఫలితాల కోసం     ఇంకా 41 రోజులు వేచిచూడాల్సిందే

మూడంచెల భద్రత నడుమ స్ట్రాంగ్‌       రూమ్‌లలో ఈవీఎంలు

సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు : పోలింగ్‌ ముగిసింది. మరో 41 రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. విజేతలెవరు? పరాజితులెందరు? ఓటరు ఆదరణ ఎవరికుంది? అన్నది స్పష్టం కానుంది. గురువారం పోలింగ్‌ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను పెనమలూరు నియోజకవర్గంలోని ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపరిచారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు.. అలాగే ఏలూరు పార్లమెంట్‌కు సంబంధించిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల ఈవీఎంలను బందరులోని కృష్ణా యూనివర్సిటీకి తరలించారు. ఈ రెండు కేంద్రాల వద్ద ఈ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, మూడంచెల పోలీస్‌ భద్రత నడుమ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల రోజులుగా ఎన్నికల బందోబస్తులో కీలక విధులు నిర్వహించిన పోలీసులు పోలింగ్‌ పూర్తయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడితో వారి బాధ్యత తీరలేదు. ప్రస్తుతం బందోబస్తులో ఉన్న సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాల నుంచి స్ట్రాంగ్‌ రూమ్‌లకు మార్చారు. వచ్చే నెల 23న ఉదయం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు వాటిని పర్యవేక్షిస్తూ.. బందోబస్తు కొనసాగించాల్సిందే. గంగూరులో డీసీపీ ఉదయరాణి ఈ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంలు జాగ్రత్తగా స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఉంచామని, మూడంచెల భద్రతా వ్యవస్థ ఉందని పోలీసు అధికారులు తెలిపారు.అనుమతి లేనివారు కాలేజీ లోనికి అనుమతించమని అధికారులు తెలిపారు. జిల్లాలో 35,51838 మంది ఓటర్లు ఉండగా.. 81.10 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన
మచిలీపట్నంసబర్బన్‌/కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంను జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి శుక్రవారం సందర్శించారు. ఈవీఎంలు భద్రపరిచిన గదులను పరిశీలించారు. కలెక్టర్‌కు ఎస్పీ త్రిపాఠి స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసు బందోబస్తుకు సంబంధించిన విషయాలను వివరించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని ఈవీఎంలను, వీవీప్యాడ్‌లను పటిష్ట బందోబస్తు నడుమ భద్రపరిచామన్నారు. కృష్ణా యూనివర్సిటీ, గంగూరులోని ధనేకుల ఇంజినీరింగ్‌ కళాశాలలో భద్రపర్చిన ఈవీఎంల స్ట్రాంగ్‌ రూంలకు పలు పార్టీలకు సంబంధించిన నాయకుల సమక్షంలో కలెక్టర్‌ సీల్‌ వేశారు. అనంతరం ఎస్పీ యూనివర్సిటీ వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలతో అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్‌ రూంలతో పాటు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అపరిచిత వ్యక్తులు వర్సిటీ చుట్టుపక్కల తారసపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన జిల్లా అడిషనల్‌ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు డీఎస్పీ మహబూబ్‌బాషాలతో స్ట్రాంగ్‌రూం బందోబస్తుపై పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల అబ్జర్వర్‌లు అక్తర్‌అన్సారీ, బినోదానంద్, రాకేష్‌కుమార్‌పాండే ఉన్నారు.

మరిన్ని వార్తలు