స్పందన, పోలీస్‌ వీక్లీ ఆఫ్‌పై ప్రధాని ప్రశంసలు

1 Nov, 2019 04:37 IST|Sakshi

ఏవిధంగా అమలు చేస్తున్నారో వివరాలు తీసుకున్న మోదీ

గుజరాత్‌లోని వడోదరలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పోలీస్‌ ఎగ్జిబిషన్‌ స్టాల్‌ సందర్శన

సీఎం వైఎస్‌ జగన్‌ కృషిని ప్రధానికి వివరించిన డీఐజీ పాల రాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘స్పందన’ కార్యక్రమంతో పాటు పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తుండటాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రెండు కార్యక్రమాలు ఏ విధంగా అమలు చేస్తున్నారో వివరాలను అడిగి తీసుకున్నారు. భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఏక్‌తా దివస్‌లో భాగంగా గురువారం గుజరాత్‌లోని వడోదరలో అన్ని రాష్ట్రాల పోలీసు శాఖలు, దేశ పోలీసు బలగాల విభాగాలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఎగ్జిబిషన్‌లో రాష్ట్ర పోలీసు శాఖ ఏర్పాటు చేసిన టెక్నాలజీ స్టాల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు టెక్నాలజీ డీఐజీ పాలరాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంతో అమలవుతున్న స్పందన కార్యక్రమం గురించి ప్రధానికి వివరించారు. ప్రతి సోమవారం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలీసు శాఖ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం గురించి, ఆ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఏ తరహాలో పరిష్కరిస్తున్నదీ స్పష్టీకరించారు.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు సంక్షేమం గురించి సీఎం తీసుకున్న చర్యలు.. ప్రధానంగా పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలు చేస్తుండటాన్ని పాలరాజు ప్రధానమంత్రికి వివరించారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కృషిని ప్రశంసించడమే కాకుండా స్పందన, పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఏ విధంగా అమలు చేస్తున్నారో నోట్‌ ఇవ్వాల్సిందిగా అడిగి మరీ తీసుకున్నారు. స్పందనలో వచ్చిన ప్రజల సమస్యలకు పరిష్కారం గురించి సీఎం ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్షించే విధానంపై ప్రధాని అభినందనలు తెలిపారని, ఈ వారం వచ్చే సమస్యలను వచ్చే వారంలోగా పరిష్కరించడాన్ని మెచ్చుకున్నారని పాలరాజు తెలిపారు.

మరిన్ని వార్తలు