సొంతింటి సంకటం

17 Nov, 2018 08:17 IST|Sakshi

ఇంకా గృహాల నిర్మాణం పూర్తికాలేదు

బ్యాంకులు రుణాలు ఇస్తాయో లేదో తెలీదు

3 వాయిదాల సొమ్ము ఒకేసారి చెల్లించాలట

అధికారుల ఆదేశాలతో లబ్ధిదారుల ఆందోళన

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం గృహ లబ్ధిదారులుఇరకాటంలో పడ్డారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయో లేదో తెలియదు కాని లబ్ధిదారులు మాత్రం వరుసగా మూడు వాయిదాల సొమ్ము చెల్లించాల్సిందేనంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతోఅందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

పశ్చిమగోదావరి,భీమవరం టౌన్‌: ప్రభుత్వం పట్టణాలలో అట్టహాసంగా చేపట్టిన అందరికీ ఇళ్లు పథకంలో గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. కొన్ని బ్యాంకులు ఇంకా లబ్ధిదారులతో అకౌంట్లు ప్రారంభించుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఇల్లు ఎప్పటికి వస్తుందో తెలియదుగాని ఒక్కసారిగా లబ్ధిదారుని వాటా సొమ్ము మొత్తం చెల్లించాలనడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జీప్లస్‌ 3 తరహాలో ఇళ్లు : సొంతిల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్న ఆశయంతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో భీమవరం పట్టణం తాడేరు రోడ్డులో 82 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ స్థలంలో జీప్లస్‌ 3 తరహాలో 9,500 ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించింది. ఆ తర్వాత దీన్ని 8,352 గృహాలకు పరిమితం చేసిఏపీ టిడ్కో పర్యవేక్షణలో ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మాణం చేపట్టింది.

తొలినుంచీ ప్రహసనమే
లబ్ధిదారుల ఎంపిక తొలి నుంచి ప్రహసనంగా మారింది. అర్హులను దరఖాస్తు చేసుకోమని ఆ తర్వాత వివిధ నిబంధనలతో మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ ఏడాదికి పైగా ప్రదక్షిణలు చేయించారు. పేదలతో రూ.200 వ్యయం చేయించి పాన్‌ కార్డులు కూడా చేయించారు. ఇల్లు మంజూరు అయ్యిందో లేదో తెలుసుకునేందుకు లబ్ధిదారులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎట్టకేలకు కొంత మందికి ప్లాట్లు కేటాయించినట్లు నంబర్లు ఇచ్చారు.

ఈ పథకంలో కేటగిరి ఎ, కేటగిరి బి, కేటగిరి సి గా విభిజించారు. కేటగిరి ఎలో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.500 ఒక విడత చెల్లిస్తే సరిపోతుంది. బ్యాంకు రుణం రూ.2,64,500.
కేటగిరి బిలో 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ. 50,000 ఒక విడతలోగాని నాలుగు విడతల్లోగాని చెల్లించవచ్చు.  బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు.
కేటగిరి సిలో 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్‌ నిర్మిస్తారు. కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ1.50 లక్షలు సబ్సిడీగా మంజూరు చేస్తుంది. లబ్ధిదారుల వాటా రూ.1,00,000. ఒక విడతలోగాని నాలుగువిడతల్లోగాని చెల్లించ్చవచ్చు. బ్యాంకు రుణం రూ.3.65 లక్షలు.

ఒకేసారి చెల్లించాలంటూ..
ఇల్లు మంజూరు కాగానే లబ్ధిదారుడు తొలి విడతగా తన వంతు వాటాను భీమవరం మున్సిపాలిటీ కమిషనర్‌ పేరిట బ్యాంకుల్లో డీడీ తీసి అందచేశారు. కేటగిరీ ఎలో రూ.500 చెల్లించడంతో లబ్ధిదారుని వాటా పూర్తయ్యింది. ఇక కేటగిరి బి విభాగంలో లబ్ధిదారులు తొలి దఫాగా రూ.12,500, కేటగిరి సీ లబ్ధిదారులు తొలి విడతగా 25,000 చెల్లించారు. తాజాగా ప్రస్తుతం ఒక వాయిదా, డిసెంబర్‌లో రెండు వాయిదాల సొమ్ము చెల్లించాలని అధికారులు ఆదేశించారు. ఒకేసారి ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పేదల్లో ఆందోళన మొదలైంది.
కేటగిరి బిలో 3,520 ఫ్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో బ్లాక్‌కు 32 ఫ్లాట్ల వంతున 110 బ్లాకులు నిర్మిస్తారు. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు బి.కేటగిరీ విభాగం లబ్ధిదారులు రూ.88 లక్షలు, సి కేటగిరీ విభాగంలో లబ్ధిదారులు రూ.7.4 కోట్లు మొత్తం రూ.7.92 కోట్లు చెల్లించే భారం పేదలపై పడుతోంది. ఆ వెనువెంటనే రెండు కేటగిరీల్లోని లబ్ధిదారులు మరో రూ.3.96 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇది పేదలకు గుదిబండగా మారింది.

బ్యాంక్‌ రుణం పొందేందుకు లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకూ బ్యాంకులు రుణం మంజూరు చేసే విషయంలో స్పష్టమైన హామీని ఇవ్వలేదు. కొన్ని బ్యాంకులు లబ్ధిదారునితో అకౌంట్లు ప్రారంభించేందుకు కూడా అంగీకరించడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే అన్ని వివరాలతోపాటు ఫ్లాట్‌ కేటాయింపు పత్రం, లీగల్‌ ఒపీనియన్, ట్రై పార్టైట్‌ అగ్రిమెంట్‌ సేల్‌ డీడ్‌ పత్రాలు కూడా అవసరమవుతాయి. ఇంత వరకూ ఇటువంటి ఏర్పాట్లు జరగలేదు.  బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించిన తర్వాతే ఇంటిపై లబ్ధిదారునికి సొంత యాజమాన్య హక్కు కలుగుతుంది. అప్పుడే యాజమాన్యపు దస్తావేజులు అందచేస్తారు.

అన్నీ వాయిదాలే
2017 జూన్‌ 19న ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 15 నెలల వ్యవధిలో పూర్తి చేసి గృహప్రవేశాలు జరిపిస్తామన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాయిదాలు పడుతూనే వస్తోంది. గృహ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. దీంతోపాటు బాహ్య భౌతిక సదుపాయాలు, ఇతర సదుపాయాలను కల్పిస్తేనే లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేయగలడు. ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదుగాని లబ్ధిదారున్ని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు.  ప్రతీ మూడు నెలలకు ఒకసారి లబ్ధిదారునితో వాయిదా సొమ్ము డీడీలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వ పరంగా జరిగిన జాప్యానికి ఇప్పుడు ఒకేసారి భారం మోపుతున్నారు.
ఒక్కసారిగా ఇంత మొత్తం ఎలా చెల్లించగలమంటూ పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల మహిళలు మున్సిపాలిటీ వద్ద ధర్నా చేశారు. చైర్మన్‌ కొటికలపూడి గోవిందరావు పేదలతో మాట్లాడుతూ  ముందుగానే లబ్ధిదారుని వాటా నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉందన్నారు. ప్రతీ మూడు నెలలకో వాయిదా చెల్లించాలని తొలి వాయిదా 2017లో కట్టారని మిగిలింది చెల్లించక తప్పదన్నారు. ప్రస్తుతం ఒక వాయిదా వచ్చేనెల ఒక వాయిదా, ఇల్లు ఇచ్చే ముందు మరో వాయిదా చెల్లించాలని సూచించారు.

బ్యాంకు రుణాలకు వెళ్లాలంటే వాయిదాలు చెల్లించాలన్నారు. పేదల విజ్ఞప్తిని మున్సిపల్‌ శాఖా మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ దృష్టికి తీసుకు వెళతానన్నారు.
అయితే పేదలు మాత్రం ఇంటి అద్దె కట్టడానికే ఇబ్బందులు పడుతున్నామని ఒకేసారి తాము వాయిదాలు చెల్లించలేమని బ్యాంకులు కూడా రుణం ఎప్పుడు ఇస్తాయో ఇంత వరకూ స్పష్టత లేదని నిరసన వ్యక్తం చేశారు.

అవస్థలు పడుతున్నాం
ఇంటి అద్దె చెల్లించలేక ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఇంటి ఖర్చులు తగ్గించుకుని మిగిల్చి దాన్ని అద్దెగా చెల్లించాల్సిన పరిస్థితి మాది. ఇల్లు మంజూరైందంటే ఎంతో ఆనందపడ్డాం. కాని ఇప్పుడు ఒకేసారి వాయిదాలు చెల్లించాలంటే రోజుకు ఒక పూటయినా కుటుంబం పస్తులు ఉండాల్సిందే. అప్పులు చేయాలి ఆ బాకీకి వడ్డీ చెల్లించాలంటే ఎన్నో తిప్పలు పడాలి. ఇలాంటి విధానం సరికాదు. పేదలకు వెసులుబాటు కల్పించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలి.– నజీరుద్దిన్, 19వ వార్డు, భీమవరం

త్రైపాక్షిక ఒప్పందం పూర్తికావాలి
బ్యాంకర్లకు, లబ్ధిదారులకు ఒప్పందం కుదరాలంటే నాలుగు వాయిదాల సొమ్ము చెల్లించి ఉండాలి. ప్రతి మూడు నెలలకు ఒక వాయిదా చెల్లించాల్సి ఉండగా ఇప్పటికే ఆలస్యమైంది. ఇళ్లు త్వరితగతిన కేటాయించాలంటే ట్రైపార్టైట్‌ (త్రైపాక్షిక ఒప్పందం) పూర్తి కావాలి. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులు వాయిదాల డీడీ అందచేయాల్సి ఉంది. లబ్ధిదారునిపై ఇప్పటి వరకూ ఎటువంటి ఒత్తిడి చేయలేదు. ఈ పాటికే వాయిదాలు చెల్లించి ఉంటే సరిపోయేది.– సుబ్రహ్మణ్యం, ఏపీ టిడ్కో ఈఈ

మరిన్ని వార్తలు