గర్భిణులకు ఆసరా.. పీఎంఎంవీవై

13 Jun, 2019 11:18 IST|Sakshi

సాక్షి,చిల్లకూరు: పెళ్లయిన ప్రతి మహిళ తొలిసారి మాతృత్వం పొందాలని తపన పడుతుంటారు. దీంతో పలు జాగ్రత్తలు పాటించి బిడ్డకు జన్మనిచ్చి మురిసి పోతారు. అయితే నేటి కాలంలో ఎక్కువగా రక్తహీనత ఏర్పడడంతోపాటు సరైన జాగ్రత్తలు పాటించక ఎంతోమంది బిడ్డలు పురుడు పోసుకునే సమయంలో మృతి చెందుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎంఎంవీవై (ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన) పథకం ద్వారా తొలిసారి గర్భందాల్చిన మహిళలకు విడతల వారీగా రూ.6 వేలను  అందిస్తోంది. దీంతో పౌష్టికాహారం తీసుకోవడమే కాకుండా తల్లీబిడ్డ క్షేమంగా ఉండేందుకు దోహదపడుతుంది. 

మండలంలో 300 మంది గర్భిణులు
మండలంలోని చిల్లకూరు, చింతవరం, వల్లిపేడు, వరగలి గ్రామాలలోని పీహెచ్‌సీల పరిధిలోని 31 గ్రామ పంచాయితీలలో ఇప్పటివరకు సుమారుగా 300 మంది వరకు గర్భిణులు ప్రతినెల పరీక్షలు చేయించుకుంటున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. వీరిలో తొలిసారి గర్భందాల్చిన వారు సుమారు 100 మంది వరకు ఉన్నారు. వీరికి పీఎంఎంవీవైలో లబ్ధి పొందే అవకాశం ఉంది. వీరు తమ పేర్లను స్థానికంగా ఉన్న వైద్య సిబ్బంది వద్ద నమోదు చేసుకుంటే వారికి బ్యాంకుల ద్వారా నగదు అందే ఏర్పాటును చేస్తారు. 

దరఖాస్తు చేసుకోవడం ఇలా..
తొలిసారి గర్భందాల్చిన గర్భిణులు మూడవ నెలలో  తమ పేర్లను ఆరోగ్య కార్యకర్తల వద్ద నమోదు చేసుకోవాలి. మొదటి విడతగా వారికి వెయ్యి అందిస్తారు. ప్రసవానికి ముందు రూ.2 వేలు, ఖాతాలో జమ చేస్తారు. ప్రసవం అనంతరం  మొదటి టీకా (డోసు) వేయించుకున్న తరువాత మరో రూ.2 వేలను అందిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే గర్భిణులు తమ బ్యాంకు పుస్తకం జెరాక్స్‌తోపాటు ఆధార్‌ కార్డును ఆరోగ్య కార్యకర్తలకు అందివ్వాలి.

ప్రత్యేక ప్రోత్సాహం కింద ఇచ్చే ఈ నగదు విషయంలో తొలిసారి గర్భందాల్చిన వారు ఏ కారణం చేతనైనా గర్భం విచ్చిన్నమైతే రెండవసారి గర్భందాల్చిన తరువాత తొలిసారిగా ఇచ్చిన వెయ్యి నగదును మినహాయించుకుని మిగిలిన రూ.4 వేలు అందించేలా చర్యలు తీసుకుంటారు. పేద మహిళలలకు ఇలా నగదు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల వారు గర్భందాల్చిన సమయంలో పౌష్టికాహారం తీసుకుని మాతా శిశుమరణాలు తగ్గించే వీలుంటుంది.     

ఖాతాలలోనే జమవుతుంది
పీఎంఎంవీవై పథకం కింద దరఖాస్తు చేసుకున్న గర్భిణులకు  రూ.5 వేలు విడతల వారీగా అందిస్తారు. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించకుంటే అదనంగా మరో వెయ్యి అందిప్తారు. దీంతో మొత్తంగా ఆరువేల నగదు గర్భిణుల ఖాతాలలోనే జమ అవుతుంది. ప్రోత్సాహంగా ఇచ్చే నగదుతో పౌష్టికాహారం తీసుకుంటే పండంటి బిడ్డకు జన్మనివ్వవచ్చు. 
 – బ్రిజిత, చిల్లకూరు, వైద్యాధికారి 

మరిన్ని వార్తలు