6 నుంచి ‘పోచారం’ నీటి విడుదల

25 Dec, 2013 03:38 IST|Sakshi

 ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ :
 వచ్చే జనవరి 6వ తేదీ నుంచి పోచారం ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేయాలని మంగళవారం నిర్వహించిన ఆయకట్టు రైతుల సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తీర్మానించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇరిగేషన్ డీఈఈ విజయేందర్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్, డిప్యూటీ తహశీల్దార్ బాలయ్య, వ్యవసాయాధికారి సంతోష్, ఈజీఎస్ ఏపీవో సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై చర్చించారు. రబీ సీజన్‌లో ఆయకట్టు పరిధిలోని ‘బి’జోన్ రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు అం దించేందుకు కావాల్సిన చర్యలపై ప్రణాళిక రూ పొందించారు. కాలువలో చాలా చోట్ల నాచు, పిచ్చిమొక్కలు పేరుకుపోవడం వల్ల వాటిని ఉపాధిహామీ ద్వారా తొలగించాలని తీర్మానించారు. పలుచోట్ల ఎక్కువగా ఉండడంతో వాటిని జేసీబీ ద్వారా తొలగించాలని నిర్ణయించారు.
 
  పోచారం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం ఉండడంతో పాటు రెండు మండలాల్లోని చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు. రైతులు సాగునీటిని వృథా చేయకుండా ముందు జాగ్రత్త చర్యలుగా కాలువలకు ఉన్న గండ్లను పూడ్చివేయాలని ఎమ్మెల్యే సూచించారు. రబీ సీజన్‌లో రైతులు ఎక్కువ మొత్తంలో పంటలను సాగు చేసేలా  అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచేలా చూడాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన సమయానుసారం ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని తీర్మానించారు. సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు దేవేందర్, శ్రీనివాస్‌రెడ్డి, నారాగౌడ్, మైదపు శ్రీనివాస్, వెంకటేశం, నాయకులు కృషారెడ్డి, నక్కగంగాధర్, సాయాగౌడ్,  నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డితో పాటు ఆయా గ్రామాల రైతులు, నీటి సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు