పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

3 Nov, 2015 01:25 IST|Sakshi
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

భర్త మరణంతో బలవన్మరణానికి   పాల్పడిన భార్య
{పాణాపాయం నుంచి బయటపడ్డ   చిన్నారులు
 

కర్లపాలె ం  ప్రేమించి పెళ్లాడిన భర్త హఠాన్మరణం చెందడంతో భార్య తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృతిచెందగా పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం మండలం పాతనందాయపాలెంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాతనందాయపాలెంకు చెందిన రావూరి శ్రీనివాసరెడ్డి, చిరంజీవి దంపతుల కుమారుడు రావి నాగేంద్రరెడ్డి కర్లపాలెం పంచాయతీ ఎంవీ.రాజుపాలెంకు చెందిన పిట్టు సుబ్రమణ్యంరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమార్తె భూలక్ష్మి గత  తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం కావటంతో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహమైన ఏడాదికి మణికంఠారెడ్డి (8), మరో రెండేళ్లకు సాయిప్రకాష్‌రెడ్డి (6) జన్మించాడు. ఇద్దరిదీ పేద కుటుంబం కావడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం భర్త నాగేంద్రరెడ్డి ఓ విద్యుత్ కాంట్రాక్టర్ వద్ద పని చేసేందుకుగాను కడప జిల్లా బద్వేలు వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి పైన పడటంతో అతను మృతిచెందాడు. భర్త మరణంతో భార్య భూలక్ష్మి మనోవేధనకు గురైంది. భర్త పెద్ద కర్మ పూర్తికాకముందే ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

భర్త మరణానంతరం తన ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామంలో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పాతనందాయపాలెంలోని అత్తమామల ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళుతుండేది. తన ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న ప్రైవేటు విద్యాలయంలో చదివిస్తోంది. పేద కుటుంబం ఆపై భర్త మరణంతో మనోవేధనకు గురైంది. ఆదివారం కర్లపాలెంలోని అత్తమామల ఇంటికి భూలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకువచ్చింది. రాత్రి 7 గంటల తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శీతలపానీయంలో ఎలుకల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించింది. తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించి వారికి కూడా ఎలుకల మందు కలిపిన శీతల పానీయం తాగించింది. విషం అని తెలియని చిన్నారులు శీతలపానీయం తాగిన వెంటనే బయటకు వచ్చి వాంతి చేసుకోవడంతో గమనించిన స్థానికులు ముగ్గురినీ వెంటనే స్థానికంగా ఉన్న వైద్యశాలకు తరలించారు. వీరిని పరిక్షించిన వైద్యుడు భూలక్ష్మి (28) మృతిచెందినట్లు ధృవీకరించారు. వైద్యుడి సలహా మేరకు చిన్నారులను పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. తాగిన వెంటనే వాంతి చేసుకున్న చిన్నారులిద్దరూ సకాలంలో వైద్య సేవలందటంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు.

 అనాథలైన చిన్నారులు
 తల్లిదండ్రులు ఇద్దరూ మృతిచెందడంతో చిన్నారులు ఇద్దరూ అనాథలయ్యారు. విషం తాగిన అనంతరం సకాలంలో వైద్యం అందడంతో చిన్నారులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పూర్తిగా కోలుకున్న చిన్న కుమారుడిని ఇంటికి తీసుకువెళ్లగా, పెద్ద కుమారుడు పూర్తిగా కోలుకోకపోవడంతో వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మణికంఠారెడ్డికి తల్లి మృతి వార్త తెలియనివ్వలేదు. కుటుంబ సభ్యులు సోమవారం భూలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించారు.

గ్రామంలో విషాదఛాయలు
భూలక్ష్మి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉంటున్న భార్యభర్తలు అకాలమరణం చెందడం గ్రామస్తులను కలచివేసింది. హాయిగా జీవనం సాగిపోతున్న తరుణంలో భర్త ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందడం, ఆ వెంటనే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం, చిన్నారులు అనాధలు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు