పోకిరికిరి

14 Sep, 2014 01:36 IST|Sakshi
పోకిరికిరి
అనంతపురం క్రైం :   ఆడవాళ్లు అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగినప్పుడు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లన్నారు మహాత్మాగాంధీ. అర్ధరాత్రి సంగతి దేవుడెరుగు.. కనీసం పట్టపగలు కూడా అలాంటి పరిస్థితులు కన్పించడం లేదు. అనంతపురంలో యువతులు, మహిళలు పగటి పూట సైతం తండ్రో, అన్నో, తమ్ముడో, స్నేహితులో.. ఇలా ఎవరో ఒకరి తోడు లేకుండా వెళ్లలేకపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. ఇటీవల చైన్‌స్నాచింగ్‌లు ఎక్కువ కావడంతో మహిళలు ఆభరణాలు వేసుకుని కనీసం ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లడానికి కూడా జంకుతున్నారు. ఇక యువతుల పరిస్థితి మరీ
 ారుణం. నడిరోడ్డుపైనే ఆకతాయిల వెకిలి చేష్టలతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా కొరవడడంతో రోడ్‌సైడ్ రోమియోలు రెచ్చిపోతున్నారు. కళాశాలల వద్ద కాపు కాస్తూ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. కొన్ని కళాశాలల్లో సైతం ఈ జాడ్యం పురుడుపోసుకుంటోంది. దీంతో ఎన్నో ఆశలతో ఉన్నత లక్ష్యంతో విద్యాభ్యాసం చేస్తున్న యువతులు మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇంటి నుంచి కళాశాలకు, బయటకు వెళ్లాక తాము పడుతున్న ఇబ్బందులను ఇంట్లో వాళ్లకు చెబితే ఎక్కడ తమ చదువును అర్ధంతరంగా ఆపేస్తారోనన్న ఆందోళన విద్యార్థినులను వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు నరకయాతన అనుభవిస్తున్నారు.  
 గ్యాంగ్‌లుగా ఏర్పడి ఈవ్‌టీజింగ్ 
 అనంతపురంలోని కొన్ని కూడళ్లలో యువకులు గ్యాంగ్‌లుగా ఏర్పడి ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు, యువతులు, మహిళలను వేధించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇక హాస్టళ్లు ఎక్కువగా ఉండే సాయినగర్, జీసెస్‌నగర్, కమలానగర్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. రెండో రోడ్డు, విద్యుత్ నగర్, కమలానగర్, పాతూరు ప్రాంతాల్లో పోకిరీల బెడద ఎక్కువవుతోంది. ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారిని గుర్తించి వారి వెంటే వెళ్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ సమయంలో ఎదురుతిరిగితే ఎక్కడ తమ పరువు బజారున పడుతుందోనని యువతులు భయపడుతున్నారు. మూడ్రోజుల క్రితం ఓ వివాహిత మెడికల్ కళాశాల మీదుగా అశోక్‌నగర్ వైపు ద్విచక్ర వాహనంలో ఒంటరిగా వెళ్తుండగా వెనుక వైపు నుంచి బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ‘హాయ్ ఆంటీ’ అని అసభ్యపదజాలంతో ఇబ్బంది పెట్టి వెళ్లిపోయారు. ఇదే తరహాలో సాయినగర్‌లోని ఓ హాస్టల్ యువతి కొన్ని వస్తువులు కొనుక్కునేందుకు దుకాణానికి వెళ్తుండగా అక్కడే కాపు కాసిన యువకులు ఈవ్‌టీజింగ్ చేయడంతో ఆమె తిరుగుముఖం పట్టింది. విషయాన్ని హాస్టల్ నిర్వాహకులకు చెప్పిన తర్వాత స్థానికులు స్పందించేలోగా ఆ యువకులు పరారయ్యారు. ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నా తల్లిదండ్రులకు చెబితే ఇబ్బందులు వస్తాయని అమ్మాయిలు లోలోపలే కుమిలిపోతున్నారు. కాగా కొన్ని మహిళా కళాశాలల్లోకి బయట వ్యక్తులు కూడా వచ్చి ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో కోచింగ్ సెంటర్లకు వెళ్తున్న యువతులు కూడా ఈవ్‌టీజింగ్ బాధితులుగా మారుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో వెంటబడి మరీ సతాయిస్తున్నారు. 
 కొరవడిన నిఘా 
  అనంతలో పరిస్థితి ఇంతగా దిగజారుతున్నా పోలీసులు మాత్రం నిఘా పెంచడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల విద్యార్థినులు, మహిళలకు భరోసా ఇచ్చేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీంతో పోకిరీలు మరింత రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు ఉండే కళాశాలల వద్ద గతంలో మఫ్టీలో పోలీసులు ఉండేవారు. మహిళా కానిస్టేబుళ్లు గస్తీ నిర్వహించేవారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి ఇలాంటి పోకిరీలకు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వాలని విద్యార్థినులు, మహిళలు, ప్రజలు కోరుతున్నారు. కళాశాలల్లో, ప్రధాన కూడళ్లలో ఫిర్యాదు బాక్స్ ఏర్పాటు చేసి.. అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించే ఏర్పాటు చేస్తే బావుంటుందని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే పోకిరీల పనిపట్టే అవకాశం ఉంటుంది.
 ముందస్తు చర్యలపై దృష్టి సారించాలి
  నగరంలో ఈవ్‌టీజింగ్ జరుగుతున్నా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంటోంది. అయితే ఫిర్యాదు అందిన తర్వాత మాత్రం పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. శనివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఓ ఎయిడెడ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలో ఈ విద్యార్థితో పాటు మరికొందరు ఈవ్‌టీజింగ్ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో తల్లిదండ్రులను పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చి పంపారు. కేసుకడితే విద్యార్థి భవిష్యత్తు నాశనమవుతుందని కళాశాల యాజమాన్యం విజ్ఞప్తి చేయడంతో కౌన్సెలింగుతోనే సర్దుకున్నారు. అలాగే ఫోన్‌లో తనను వేధిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, ఎస్‌ఐలు జాకీర్‌హుసేన్, విశ్వనాథచౌదరి నలుగురు పోకిరీలకు తమైదనశైలిలో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. నలుగురు యువకులకు సప్తగిరి సర్కిల్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా వివాహితను సైగలు చేస్తూ ఇబ్బందులకు గురి చేసిన అనంతపురం రూరల్ జ్యోతిబసు కాలనీకి చెందిన శ్రీనివాసులుపై రూరల్ పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. కాగా తమను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్న వారు చాలా అరుదుగా ఉంటున్నారు. తల్లిదండ్రుల సహాయంతో పోకిరీలకు అడ్డుకట్టవేయగలుగుతున్నారు. అయితే చాలా మంది ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నా వారి తల్లిదండ్రులు మాత్రం మనకెందుకొచ్చిన గొడవంటూ సముదాయించి ముందడుగు వేయలేకపోతున్నారు. ఫిర్యాదు అందితే చర్యలకు ఉపక్రమిస్తున్న పోలీసులు ముందస్తుగా నిఘా పెంచి ఈవ్‌టీజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉందని నగర వాసులు కోరుతున్నారు.  
 
మరిన్ని వార్తలు