ఆర్డినెన్స్ ఆంధ్రా పెద్దల కుట్ర

1 Jun, 2014 02:08 IST|Sakshi
ఆర్డినెన్స్ ఆంధ్రా పెద్దల కుట్ర

 ఆంధ్రా సంపన్నుల కోసం ఆదివాసీలను బలిచేస్తారా?: కోదండరాం
వేలేరుపాడు/భద్రాచలం,న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో అడవిని నమ్ముకొని బతుకుతున్న ఆదివాసీల జీవితాలను ఆంధ్రాలోని సంపన్నుల కోసం కేంద్ర ప్రభుత్వం బలి చేస్తోందని తెలంగాణ జేఏసీ చైర్మన్  కోదండరాం అన్నారు. పోలవరం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం కోయిదా నుంచి నిర్వహిస్తున్న పాదయాత్రను శనివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ముంపు ప్రాంతంలో ఆదివాసీల మనోభావాలు తెలుసుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిం చారు.

ఆంధ్రా పెద్దల కుట్రలో భాగంగానే ఇదంతా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదనీ, అయితే డ్యాం ఎత్తు తగ్గించి ముంపును తగ్గించాలని కోరారు. ఆంధ్రాలోని ఇంజినీరింగ్ నిపుణులు కూడా ఇదేమాట చెబుతున్నారన్నారు. తెలంగాణలో ఉన్న ముంపు మండలాలను వదులుకునే ప్రసక్తే లేదని, సీమాంధ్రలో కలిపేలా రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు కోసం తుదివరకూ పోరాడతామని కోదండరాం చెప్పారు. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరిగే సవుయుంలో తెలంగాణ ఎంపీలతో పాటు అన్ని ప్రాంతాల ఆదివాసీ ఎంపీల సహకారంతో అడ్డుకుంటామని తెలిపారు.

బాబూ.. ఆదివాసీల గురించి ఆలోచించు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివాసీల సంక్షేవుం గురించి ఆలోచించాలని కోదండరాం కోరారు. అడవిని నమ్ముకొని బతుకుతున్న వారికి అన్యాయం చేయవద్దన్నారు. తెలంగాణ ప్రాంతానికి నష్టం జరగకుండా గోదావరి జలాలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు.  

ఎమ్మెల్యే రాజయ్యకు మద్దతు
భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను కోదండరాం శనివారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు రాక్షసత్వం కారణంగానే ఈ ఆర్డినెన్స్ వచ్చిందన్నారు. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీలను మనుషులుగా గుర్తించినట్లైతే చంద్రబాబు ఈ విషయం లో స్పందించాలన్నారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందును ఇప్పుడేమీ చేయలేమని గవర్నర్ చెబితే సరిపోదని, రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతినిధిగా గిరిజనుల ఇబ్బం దులను గమనించాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు