పునరావాస కాలనీలకు పోలవరం నిర్వాసితులు

23 Jul, 2020 05:36 IST|Sakshi
నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు అందిస్తున్న కలెక్టర్‌ మురళీధరరెడ్డి, చిత్రంలో ఎమ్మెల్యే ధనలక్ష్మి

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభం

దేవీపట్నం: పోలవరం నిర్వాసితులకు పునరావాస కాలనీల్లో సిద్ధమైన ఇళ్లను అందచేసే కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ (అనంతబాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దేవీపట్నం మండలం ఇందుకూరు–2, పోతవరం–2 పునరావాస కాలనీలను ప్రారంభించి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.

సకల సదుపాయాలతో కూడిన సొంత ఇళ్లను చూసి ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన నిర్వాసితులకు దేవీపట్నం మండలం పరిసర గ్రామాల్లో ఎనిమిది చోట్ల కాలనీలు నిర్మిస్తున్నారు. వాటిలో ప్రస్తుతం వెయ్యి ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా మరో వెయ్యి గృహాల నిర్మాణం త్వరలో పూర్తి కానుంది. టీడీపీ హయాంలో పోలవరం పనులను ప్రణాళిక లేకుండా చేపట్టడం, కాఫర్‌ డ్యామ్‌లపై నిర్లక్ష్యం కారణంగా గతేడాది గోదావరి వరద ముంపులో చిక్కుకుని గిరిజన గ్రామాల  ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కాలనీల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసింది.

సమన్వయంతో వేగంగా కాలనీల నిర్మాణం: కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి
► అతి తక్కువ సమయంలో అన్ని శాఖల సమన్వయంతో కాలనీల నిర్మాణం పూర్తి చేశామని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పోలవరం పరిపాలన అధికారిని కూడా నియమించిందన్నారు. 
► పోలవరం ప్రాజెక్టుతో నిర్వాసితులవుతున్న వారు త్యాగజీవులని, వారికి ఏ సమస్య రాకుండా పూర్తిస్థాయిలో పునరావాస ప్యాకేజీ, భూమికి భూమి అందజేస్తామని డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో వరదల వల్ల ఇబ్బందులు 
ఎదురయ్యాయన్నారు.
► ఈ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారి ఓ.ఆనంద్, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవో ప్రవీణ్‌ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు