లాలూచీ ఎవరిది?

10 May, 2018 11:58 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ట్యాంకర్‌ నుంచి సిమెంటును ప్లాంట్‌లోకి దించుతున్న దృశ్యం

బయటకొచ్చిన పోలవరం ప్రాజెక్టు సిమెంటు

మార్గమధ్యంలో ట్యాంకర్ల నుంచి తీస్తున్నారా?

ప్రాజెక్టు సిబ్బంది ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారా!

తమకు సంబంధంలేదంటున్న కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు

అనుమానాలకు తావిస్తున్న సిమెంటు పక్కదారి వ్యవహారం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు ట్యాంకర్లలో వస్తున్న సిమెంటు పక్కదారి పడుతోంది. గత కొంత కాలంగాఈ వ్యవహారం గుట్టుగా జరుగుతోందని తెలుస్తోంది. ఇటీవల గోపాలపురం మండలంలోని కరిచర్లగూడెంలో ఒకేసారి 324 బస్తాల సిమెంటు అమ్మకానికి పెట్టడం, సమాచారం తెలిసి అధికారులు దాడులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు వాడాల్సిన సిమెంటు పక్కదారి పట్టి అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. దాదాపు ఏడాది క్రితం ఇదే విషయమై పోలవరం పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదు చేసి, ట్యాంకర్ల డ్రైవర్లను అరెస్ట్‌ చేశారు. అప్పట్లో ఒక ట్యాంకర్‌ సిమెంటును ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి దారిమళ్లించి, బయట మార్కెట్‌లో అమ్ముకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మళ్లీ తాజాగా విషయం వెలుగులోకి రావడంతో సిమెంటు దారిమళ్లింపుపై చర్చ జరుగుతోంది. ప్రాజెక్టులో ట్యాంకరు సిమెంటును అన్‌లోడ్‌ చేసిన తరువాత అడుగున కొంత సిమెంటు మిగులుతుంది. అలా మిగిలిన దానిని మాత్రమే డ్రైవర్లు అమ్ముకుంటున్నారని ప్రాజెక్టు సిబ్బంది కొందరు చెప్పుకొస్తున్నా.. అన్‌లోడ్‌ చేసేటపుడు సరుకు పూర్తిగా ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తాజాగా ప్రాజెక్టుకు చెందిన 324 బస్తాల సిమెంట్‌బయట ప్రయివేటు వ్యక్తులు అమ్మకానికి పెట్టడంతో ఇందులో పెద్ద కుంభకోణమే జరిగి ఉంటుందనే అనుమానాలకు తావిస్తోంది. అసలు సిమెంటు లోడు ట్యాంకర్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణప్రాంతానికి చేరకుండానే మార్గం మధ్యలో బస్తాలను బయటకు తీసి దాచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

కాంట్రాక్టు ఏజెన్సీలు ఏమంటున్నాయంటే..
ప్రాజెక్టుకు సంబంధించిన సిమెంటు బయట మార్కెట్‌లో అమ్ముకుంటున్న విషయమై తమకు ఏవిధమైన సంబంధంలేదని కాంట్రాక్ట్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరకుండానే సిమెంటును అమ్ముకుంటే.. నిర్మాణ ప్రాంతంలో అన్‌లోడ్‌ చేసేటపుడు తెలిసిపోతుందని అంటున్నారు. ట్యాంకర్లలో తెచ్చిన సిమెంటును పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అప్పగించినట్లు రశీదు లేదా బిల్లులు చూపించకపోతే సిమెంటు కంపెనీలు ఊరుకోవు. సరుకు తగినంతగా అందకపోయినా అందినట్లు బిల్లులు ఇచ్చి ప్రాజెక్టు సిబ్బంది ఎవరైనా సిమెంటు కంపెనీలతో లాలూచీ పడ్డారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒకసారి జరిగితే డ్రైవర్లు డబ్బులకు ఆశపడి సిమెంటు అమ్ముకున్నారని అనుకోవచ్చు. కానీ తరచూ ఇటువంటి అమ్మకాలు జరుగుతుండటం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఎవరైనా వీరికి సహకరిస్తున్నారా అనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇలాగే కాకుండా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో సరుకు అప్పగించిన తరువాత ట్యాంకర్లలో మిగిలిన సిమెంటును కూడా డ్రైవర్లు అమ్ముకుంటారు. ట్యాంకర్ల నుంచి సిమెంటు కొనుగోలు చేసేందుకు గోపాలపురం మండలంలోని కరిచర్లగూడెం, జగన్నాథపురం, కోమటికుంట గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు సిద్ధంగా ఉంటారని తెలుస్తోంది.

బస్తా (50 కేజీలు) సిమెంటును రూ.150 వరకు కొనుగోలు చేసి, అవసరమైన వారికి రూ.250కి అమ్ముతున్నారని చెబుతున్నారు.

నిత్యం 35 నుంచి 40 ట్యాంకర్లు రాక
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ప్రస్తుతం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల కోసం నిత్యం 35 నుంచి 40 వరకు ట్యాంకర్లలో సిమెంటు మూడు కంపెనీల నుంచి వస్తోంది. ఒక్కో ట్యాంకర్‌ 30 టన్నుల అంటే 600 బస్తాల సిమెంటును తీసుకువస్తుంది. దాదాపు 10 లక్షల టన్నుల సిమెంటు వినియోగించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

ఇదిలా ఉంటే తమ వద్ద ఎటువంటి పొరపాట్లకు ఆస్కారంలేదని, ఎంత సిమెంటు అప్పగిస్తే అంత సిమెంటుకే కంపెనీలకు సొమ్ము చెల్లిస్తామని నవయుగ సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ క్రాంతి చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో గోపాలపురం పరిసర ప్రాంతాలలో తమ సిబ్బందితో రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. తమకు అందిన సిమెంటుకే బిల్లు ఇస్తామన్నారు.

మరిన్ని వార్తలు