పోలవరంలో కమీషన్లు షురూ!

19 Sep, 2016 07:52 IST|Sakshi
పోలవరంలో కమీషన్లు షురూ!

♦ ప్రత్యేకహోదా బలిచేసి సాధించిన ప్యాకేజీ ఫలాలివే..
♦ 25 శాతం కమీషన్‌కు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత
♦ ఈపీసీ నిబంధనలు.. మంత్రి వర్గం తీర్మానాలు హుష్‌కాకి
♦ కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దలు కుమ్మక్కు
♦ పనులు వేగవంతం చేసే పేరుతో మళ్లీ తెరపైకి సబ్‌ కాంట్రాక్టర్లు
♦ ఆమోదముద్ర వేసేందుకు నేడు ముఖ్యమంత్రి సమావేశం
♦ గతంలో బిల్లులు ఇవ్వని రాయపాటిపై సబ్‌ కాంట్రాక్టర్ల ఫిర్యాదు
♦ సర్కార్, పీపీఏ స్పందించకపోవడంతో పనులు ఆపేసిన వైనం


సాక్షి, హైదరాబాద్‌: ఐదు కోట్ల మంది ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టి దక్కించుకున్న మొదటి ‘ప్యాకేజీ’.. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమవుతోందా? రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్రం పోలవరం ప్రాజెక్టును అప్పగించి 24 గంటలు గడవక ముందే హెడ్‌ వర్క్స్‌ అంచనాను రూ.1,482 కోట్లు పెంచేసి.. ఆ మేరకు కమీషన్లు కొట్టేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారా? అవుననే అంటున్నారు సాగునీటి శాఖ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ కమీషన్ల వ్యవహారం ముందుకు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపీసీ(ఇంజనీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో సర్కార్‌ అనుమతితో 50 శాతం పనులను మాత్రమే సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ, ఈ నిబంధనను తుంగలో తొక్కి హెడ్‌ వర్క్స్‌ పనులను గంపగుత్తగా సబ్‌ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి.. ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటితో కలిసి పర్సంటేజీలు పిండుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని వినిపిస్తోంది.

సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై ఆమోదముద్ర వేసేందుకు జలవనరుల శాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ సబ్‌ కాంట్రాక్టు సంస్థలు ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. పనులు ఆపేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేయడం కోసమే సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని అర్ధం చేసుకోవచ్చు.

ఐదు కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, స్పిల్‌ వే, పవర్‌ హౌస్‌ పునాదుల నిర్మాణం) పనులను రష్యా, ఒమన్‌ దేశాల కంపెనీల భాగస్వామ్యంతో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన టాన్స్‌ట్రాయ్‌(ఇండియా) లిమిటెడ్‌ మార్చి 2, 2013న రూ.4,054 కోట్లకు చేజిక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 60 నెలల్లో అంటే మార్చి 2, 2018లోగా పనులు పూర్తి చేయాలి. కేవలం పనులను కాజేసేందుకే రష్యా, ఒమన్‌ సంస్థల భాగస్వామ్యాన్ని ట్రాన్స్‌ట్రాయ్‌ సంపాదించింది. ఆ సంస్థలు క్షేత్రస్థాయిలో పనులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. దాంతో గతేడాది సెప్టెంబరు 15 నాటికి 4.54 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.

కాంట్రాక్టరును రక్షించి కమీషన్లు కొట్టేయడమే లక్ష్యం..
పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనుల తీరుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పీపీఏ అసహనం నేపథ్యంలో ఈపీసీ విధానంలో 60సీ నిబంధన కింద ట్రాన్స్‌ట్రాయ్‌పై వేటు వేసి.. మళ్లీ టెండర్‌ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. స్టీలు, సిమెంటు, డీజిల్‌ వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయం కూడా తగ్గుతుందని.. ఆ మేరకు ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని సూచించారు. కానీ.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. కాంట్రాక్టర్‌ రాయపాటిని రక్షించడం, భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘పెద’బాబు ఎత్తు వేశారు.

ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ జలవనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో గతేడాది సెప్టెంబరు 30న నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన పూర్తి నివేదికను బుట్టదాఖలు చేసిన సర్కార్‌.. పనులు సకాలంలో పూర్తి చేసే సామర్థ్యం ట్రాన్స్‌ట్రాయ్‌కు లేదని, కొంత భాగం పనులను అనుభవజ్ఞులైన సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న ప్రతిపాదనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు పీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రధాన కాంట్రాక్టర్, సబ్‌ కాంట్రాక్టర్లు, ఆర్థికసంస్థలతో ‘ఎస్క్రో’ అకౌంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని, పనుల ప్రగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన కాంట్రాక్టర్, సబ్‌ కాంట్రాక్టర్లు సర్కార్‌తో మరో సారి ఒప్పందం చేసుకోవాలని గతేడాది అక్టోబరు 10న మంత్రివర్గం సమావేశంలో ఏకంగా తీర్మానాన్ని చేశారు. ఆ తీర్మానాన్ని అమలు చేస్తూ ఈ ఏడాది జనవరి 25న అప్పటి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మెజారిటీ వాటా పెదబాబుకే..
అంచనాలు పెంచేసిన నేపథ్యంలో ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటి 25 శాతం కమీషన్‌పై పనులను సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్లు ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఓ కీలక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఇందులో మెజారిటీ వాటా పెదబాబుకు దక్కుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గంపగుత్తగా పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధలనకు విరుద్ధం కావడంతో, సర్దుబాటు చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై ఆమోదముద్ర వేసేందుకు జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అధికారులతో సోమవారం సమావేశమవుతున్నారు. పనులను 2018లోగా పూర్తి చేయాల్సి ఉందన్న సాకు చూపి సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై అధికారముద్ర వేయనున్నారు. కానీ ‘ఎస్క్రో అకౌంట్‌’ వ్యవస్థ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో హెడ్‌ వర్క్స్‌ పనులు చేసిన సంస్థకు కాకుండా ప్రధాన కాంట్రాక్టర్‌ రాయపాటికి బిల్లులు చెల్లిస్తారు. ఇప్పటికే బిల్లులు చెల్లించడం లేదని  రాయపాటిపై ఫిర్యాదు చేసినా సర్కార్‌ స్పందించకపోవడంతో ఎల్‌ అండ్‌ టీ, బావర్‌ సంస్థలు పనులు ఆపేశాయి. ఎస్క్రో అకౌంట్‌ ద్వారా బిల్లులు చెల్లిస్తే.. సబ్‌ కాంట్రాక్టు సంస్థలు కమీషన్‌ ఎగ్గొడతాయేమోననే భావన వల్లే సర్కార్‌ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది.

అనుమతులు లేవు.. ఎస్క్రో అకౌంట్‌ లేదు..
మంత్రివర్గం తీర్మానం అలా ఆమోదించిందో లేదో ట్రాన్స్‌ట్రాయ్‌ ఇలా సబ్‌ కాంట్రాక్టర్లను తెరపైకి తెచ్చింది. రాక్‌ఫిల్‌ డ్యాం పనులను పెదబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎల్‌ అండ్‌ టీకి, డయా ఫ్రం వాల్‌ పనులను బావర్‌(జర్మనీ)కు ట్రాన్స్‌ట్రాయ్‌ అప్పగించింది. కానీ.. ఇందుకు జలవనరుల శాఖ అనుమతి ఇప్పటివరకూ తీసుకోలేదు. కేబినెట్‌ తీర్మానం ప్రకారం ‘ఎస్క్రో’ అకౌంట్‌ వ్యవస్థ ను ఏర్పాటు చేయనేలేదు. సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత చేసిన పనులకు రూ.385 కోట్లకుపైగా బిల్లులను ట్రాన్స్‌ట్రాయ్‌కు ప్రభుత్వం చెల్లించింది. కానీ.. ఆ బిల్లులను సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పీపీఏకు, సర్కార్‌కు ఫిర్యాదు చేశాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోని సీఎం చంద్రబాబునాయుడు హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు, స్పిల్‌ ఛానల్‌ పనులను త్రివేణి ఎర్త్‌ మూవర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, కాంక్రీట్, పవర్‌ హౌస్‌ పునాది పనులను పూజి మీయిస్టర్‌కు, స్పిల్‌ వే పనులను ఎల్‌ అండ్‌ టీ– బావర్‌(జేవీ)లకు సబ్‌ కాంట్రాక్టుకు అప్పగించాలన్న ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేశారు. దాంతో ఆ సంస్థలు మిషనరీని రంగంలోకి దించాయి.

మరిన్ని వార్తలు