అంజయ్య శ్రీకారం.. వైఎస్‌ సాకారం

14 Mar, 2019 13:31 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన నాటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, కాంగ్రెస్‌ నేత జీఎస్‌ రావు

పోలవరం ప్రాజెక్టు పనుల ప్రారంభం వైఎస్సార్‌ ఘనతే

సాక్షి, కొవ్వూరు : రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. 1981 మే 21న అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య శంకుస్థాపన చేశారు. అప్పట్లో ఈ ప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ఆయనకు కాంగ్రెస్‌ నాయకులు స్వాగతం పలికినప్పటి చిత్రమిది. రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్య అక్కడ నుంచి కారులో కొవ్వూరు చేరుకున్నారు.

స్థానిక ఎమ్మెల్యే ఎంఏ అజిజ్‌ ఆయనతో కలిసి కారులోనే ప్రయాణించి పోలవరం వెళ్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొవ్వూరుకు చెందిన కేఎన్‌ఎం ఖాన్‌సాబు, మాజీ పీసీసీ అధ్యక్షుడు జీఎస్‌ రావు, అప్పటి భారీ నీటిపారుదల శాఖామంత్రి జీవీ సుధాకర్, ఇంజినీరింగ్‌ చీఫ్‌ ఎంఎల్‌ స్వామి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పరకాల శేషావతారం అంజయ్య వెంట ఉన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ కూడా దీనికి శంకుస్థాపన చేశారు.

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006లో పోలవరం ప్రాజెక్ట్‌కు ఇందిరాసాగర్‌ అని నామకరణ చేసి రూ.10,151.05 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించారు. ముందు చూపుతో కుడి, ఎడమ ప్రధాన కాలువలను తవ్వించారు. వైఎస్సార్‌ హయాంలోనే సుమారు 80 శాతం కాలువల తవ్వకం పూర్తి చేశారు. ఈ కాలువలను వినియోగించి 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా, విశాఖకు గోదావరి నీరు తరలించేందుకు సన్నాహాలు చేసింది.

ప్రాజెక్ట్‌ హెడ్‌వర్క్స్‌ పనుల్లో భాగంగా స్పిల్‌వే, ట్విన్‌ టన్నెల్స్, కుడి కనెక్టవిటీస్, ఎడమ కనెక్టవిటీస్‌ పనులను వైఎస్సార్‌ ప్రారంభించారు. నిర్వాసితుల పునరావాసంపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టులో 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు 960 మెగావాట్ల విద్యుత్‌ ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అవుతుంది. 24.33 టీఎంసీల నీటిని విశాఖలోని పరిశ్రమలకు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇన్నాళ్లు శంకుస్థాపనలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన వైఎస్సార్‌ చరిత్రలో నిలిచిపోయారు.

మరిన్ని వార్తలు