పోల‘వరం’... రాజన్నదే!

20 Jun, 2019 12:45 IST|Sakshi

వైఎస్సార్‌ హయాంలో పోలవరం పనులకు శ్రీకారం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి శాశ్వత ధాన్యాగారంగా నిలిపేందుకు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి​ చేసేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. బీడువారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు రాజన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా పోలవరం సాకారమే లక్ష్యంగా ముందుకు సాగారు. తెలుగు నేలను సుభిక్షం చేయడానికి 2005లోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు అంకురార్పణ చేశారు. అటవీ, పర్యావరణం సహా అన్ని అనుమతులూ తీసుకొచ్చి శరవేగంగా పనులు జరిగేలా చూశారు. వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను సాధిస్తే నిధులకు ఇబ్బంది ఉండదని భావించిన మహానేత వైఎస్సార్‌ ఆ దిశగా అడుగు ముందుకేశారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలోనే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠన్మరణం చెందారు. ఆయన హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటిదాకా జరిగిన పనుల్లో ఎక్కువ శాతం అప్పట్లో పూర్తయ్యాయి. నిజానికి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన కీలక పనులన్నీ ఆయన పూర్తి చేశారు. అయితే తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ పనులు కొనసాగుతున్నాయి. వైఎస్సార్‌ తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ ఊపంచుకుంటాయని ప్రజలు నమ్మకంతో ఉన్నారు. తండ్రి మాదిరిగానే సీఎం వైఎస్‌ జగన్‌ కూడా పోలవరం పనులను పరుగులు పెట్టారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి:
పోలవరం నిన్నటి కల.. నేటి పగటి కల

పోలవరానికి శాపంగా బాబు పాలన

‘పోలవరం’లో నామినేషన్‌దే డామినేషన్‌

సీఎం జగన్‌ పోలవరం పర్యటన ఎందుకు?

మరిన్ని వార్తలు