‘పోలవరం’ విహారయాత్రలతో రూ.84 కోట్లు ఆవిరి

18 Feb, 2019 09:32 IST|Sakshi
ఆర్టీసీ బస్సులో మందేసి చిందేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

మరో రూ.71 కోట్లు విడుదల చేయాలని పోలవరం సీఈ ప్రతిపాదన

2018 నాటికే ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ

చివరకు ప్రాజెక్టును పూర్తి చేయలేక చేతులెత్తేసిన వైనం

దీన్ని కప్పిపుచ్చుకునేందుకు పోలవరం విహారయాత్రలకు రూపకల్పన

ప్రభుత్వ సొమ్ముతో మందేసి చిందులేస్తున్న అధికార పార్టీ నేతలు

సాక్షి, అమరావతి: ప్రభుత్వం అప్పులు చేసి మరీ విహారయాత్రలకు పంపడం ఎప్పుడైనా చూశారా..? దేశంలో ఎప్పుడూ.. ఎక్కడా జరగనిది చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమే జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలవరం విహారయాత్రలకు పంపిస్తోంది. ఇందుకోసం ఇప్పటివరకు రూ.84.25 కోట్లు ఖర్చు చేసింది. తాజాగా మరో రూ.71 కోట్లు విడుదల చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ ప్రతిపాదనలు పంపడం గమనార్హం. విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కోసం సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును 2018 నాటికే పూర్తి చేసి.. గ్రావిటీ ఆయకట్టుకు నీరు విడుదల చేస్తామని 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని మొన్నటిదాకా వల్లె వస్తూ వచ్చారు.

పోలవరం ప్రాజెక్టు పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి రూ.వేలాది కోట్లను కమీషన్ల రూపంలో వసూలు చేసుకున్న చంద్రబాబు.. ప్రాజెక్టు పనులను పూర్తి చేయడం కాదు కదా కనీసం ఒక కొలిక్కి తీసుకురాలేక చేతులెత్తేశారు. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్నికల వేళ పోలవరం విహారయాత్రకు రూపకల్పన చేశారు. టీడీపీ నేతలు, సానుభూతిపరులను పోలవరం విహారయాత్రకు తీసుకెళ్లి ప్రభుత్వ భజన చేయించడం మొదలుపెట్టారు. ఈ పోలవరం విహార యాత్ర కోసం తొలి విడతగా 2018 ఏప్రిల్‌ 27న టీడీపీ ప్రభుత్వం రూ.22.25 కోట్లు మంజూరు చేసింది. రవాణా ఖర్చుల కింద కిలోమీటర్‌కు రూ.55 చొప్పున ఇవ్వాలని, ఒక్కొక్కరి అల్పాహారానికి రూ.75, మధ్యాహ్నం భోజనానికి రూ.125, రాత్రి భోజనానికి రూ.125, టీ ఖర్చులకు రూ.50 చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

కృష్ణా జిల్లా అత్యధికం..
ఒక బస్సులో 40 మంది వెళితే.. 4 బస్సుల్లో 160 మంది వెళ్లినట్లు నకిలీ రికార్డులు సృష్టించి టీడీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు. తొలి విడత నిధులన్నీ ఖర్చయిపోవడంతో.. రెండో విడతగా ప్రభుత్వం రూ.62 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ఆ నిధులు కూడా ఖర్చయిపోయాయని.. మరో రూ.71 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ పోలవరం ప్రాజెక్టు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ఇప్పటివరకు 5,62,320 మందిని తీసుకెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లా నుంచే 2,55,264 మంది పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1,02,671 మంది.. గుంటూరు జిల్లా నుంచి 84,915 మంది పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.

బస్సుల్లో మందేసి చిందులు..
పోలవరం విహారయాత్రకు వచ్చే టీడీపీ నేతలకు ప్రభుత్వ ఖర్చులతోనే మందు, విందును సమకూర్చుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్‌ 13న అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి రైతుల ముసుగులో 1,300 మంది టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే బీకే పార్థసారథి 2 రోజుల పోలవరం విహారయాత్రకు తీసుకొచ్చారు. అయితే టీడీపీ నేతలు విహారయాత్రకు ప్రభుత్వం సమకూర్చిన బస్సుల్లో మందేసి, చిందులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు