పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం

3 Jan, 2016 00:51 IST|Sakshi

 పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన ఎర్త్‌కమ్‌రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఎల్‌అండ్‌టీ, బావర్ కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని పోలవరం హెడ్‌వర్క్స్ ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు తెలిపారు. శనివారం ట్రాన్స్‌ట్రాయ్ ప్రాజెక్టు కార్యాలయంలో ఆయన కాంట్రాక్ట్ ఏజెన్సీ డీవీపీ కె.తిరుమలేష్, హెడ్‌వర్క్స్ ఈఈలు ఎన్‌పుల్లారావు, సీహెచ్ రామారావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫౌండేషన్‌వర్క్, డయాఫ్రమ్‌వాల్ పనులను చేపట్టాల్సి ఉందన్నారు.
 
 1750 మీటర్ల కాంక్రీట్‌వాల్ నిర్మాణం కూడా చేపడతామన్నారు. 110 నుంచి 130 మీటర్ల లోతు నుంచి ఈ పనులు జరుగుతాయన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న కంపెనీల వద్ద మాత్రమే దీనికి సంబంధించిన యంత్రాలు ఉన్నాయన్నారు. జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో పాటు ఇండియాలోని ఎల్‌అండ్‌టీ కలిసి ట్రాన్స్‌ట్రాయ్ ఏజెన్సీతో ఈ పనులు చేసేందుకు జాయింట్ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. డయాఫ్రమ్‌వాల్‌కు ఇరువైపులా 10మీటర్ల చొప్పున ఇసుకను గట్టిపరిచే పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పనులను శనివారం క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ ఎంటీ రాజు, ఈఈ త్రినాధరావులు పరిశీలించారన్నారు.
 
  డయాఫ్రమ్‌వాల్‌కు సంబంధించి 422కోట్ల రూపాయల అంచనాలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదనంగా సపోర్టింగ్ పనులు చేపట్టేందుకు 190కోట్లతో పనులు చేపట్టామన్నారు.ఈ సీజన్‌లో గోదావరి నదికి ఇరువైపులా పనులు చేపడుతామన్నారు. నీటి మధ్యలో వచ్చే ఏడాది పనులు చేపడుతామన్నారు. పనులు వేగవంతం చేసేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం యంత్రాలను తరలిస్తున్నామన్నారు. సాంకేతిక యంత్రాలు మద్రాసు పోర్టులో ఉన్నాయని వీటిని కూడా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి తీసుకువస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు