పరిహారంతో పునరావాసమా

5 May, 2018 13:04 IST|Sakshi
పోలవరం మండలం సరుగుడు గ్రామ సభలో ఇళ్ల నిర్మాణానికి నిధులు పెంచాలని కోరుతున్న నిర్వాసితులు

పశ్చిమగోదావరి, పోలవరం : పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణ విషయం పీటముడిగా మారింది. ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సొమ్ము సరిపోకపోతే నిర్వాసితులకు ఇచ్చే పునరావాసం నుంచి ఖర్చు చేసుకోవాలని ప్రభుత్వం ప్రతిపాదించడంపై నిర్వాసితులు భగ్గుమంటున్నారు. పరిహారం సొమ్మును ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తే తాము పునరావాస కేంద్రాల్లో ఎలా జీవించాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆమోదం పొందేందుకు పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లో అధికారులు నిర్వహించిన గ్రామ సభలను అన్నిచోట్లా నిర్వాసితులు బహిష్కరించారు. పరిహారం సొమ్ముతో సంబంధం లేకుండా నిర్వాసితుల ఆమోదంతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది నిర్వాసితుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. ఇళ్ల నిర్మాణ విషయం గ్రామసభల ఆమోదం పొందకపోవటంతో ఇప్పట్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించే పరిస్థితి లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయితే గ్రామాలు ఖాళీ చేస్తామని నిర్వాసితులు స్పష్టంగా చెబుతున్నారు. దీంతో పునరావాసం అమలులో మరింత జాప్యం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒక్కో ఇంటికి రూ.2.84 లక్షలు కేటాయింపు
ఇదిలా ఉంటే జిల్లాలోని పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక్కో ఇంటికి ప్రభుత్వం కేవలం రూ.2.84 లక్షలు కేటాయించింది. ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఇంకా పెద్ద ఇల్లు కావాలనుకుంటే రూ.4 లక్షలతో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో, రూ.8 లక్షల ఖర్చుతో 450 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వం ఇచ్చే రూ.2.84 లక్షలు పోనూ మిగిలిన మొత్తాన్ని నిర్వాసితులే పరిహారం సొమ్ము నుంచి భరించాలని షరతుపెట్టింది. దీంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 13,885 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. దీనికోసం పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఇళ్ల నిర్మాణానికి రూ.1,030.15 కోట్లు మంజూరు చేసింది. అయితే నిర్వాసితులు అంగీకరించటంతో పాటు, ముంపు గ్రామాల్లో గ్రామసభల ఆమోదం పొందితే తప్ప ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. నిర్వాసితుల అంగీకారం తీసుకోవటం ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తలనొప్పిగా మారింది. ఇళ్ల నిర్మాణంపై నిర్వాసితుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె.మోహన్‌కుమార్‌ చెబుతున్నారు.

పునరావాస కేంద్రంలో ఎలా బతకాలి
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు కోండ్ల కన్నపరెడ్డి. పోలవరం మండలంలోని పల్లపూరు గ్రామం ఇతనిది. కొండరెడ్డి తెగ గిరిజనుడు. ఇతనికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబం కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. బుట్టాయగూడెం మండలంలోని రెడ్డి గణపవరంలో ఇంటి స్థలం ఇచ్చారు. అధికారులు ఇంటి ఫొటో కూడా చూపించారని, అగ్గిపెట్టెలా ఉన్న ఇంటిలో ఎలా ఉండాలని కన్నపరెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సరిపడా ఇల్లు కట్టుకుందామంటే మిగిలిన సొమ్ము పరిహారం నుంచి పెట్టుకోమంటున్నారు. పరిహారం ఇచ్చేది రూ.6.86 లక్షలు. ఈ సొమ్ము ఇంటికి ఖర్చుపెడితే పునరావాస కేంద్రంలో ఎలా జీవించాలంటూ ఆవేదన చెందుతున్నాడు. ప్రభుత్వమే మంచి ఇల్లు కట్టివ్వాలని కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు