2021 నాటికి పోలవరం పూర్తి చేస్తాం

3 Feb, 2020 04:53 IST|Sakshi
పోలవరం ప్రాజెక్టు పనుల తీరును మ్యాప్‌ ద్వారా వివరిస్తున్న ఎస్‌ఈ ఎం.నాగిరెడ్డి

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

ప్రాజెక్టు పనులు పరిశీలన, అధికారులతో సమీక్ష

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టి 2021కి పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, ఆ విధంగానే పనులు పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆదివారం ఆయన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్‌వే గ్యాప్‌–3 పనులకు తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వద్ద ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ గ్యాప్‌–1 పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో మేఘా క్యాంపు కార్యాలయంలో పోలవరం పనులు జరుగుతున్న తీరు, ఆర్‌అండ్‌ఆర్‌ అమలుకు సంబంధించిన పనులపై సమీక్షించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వరదల సమయానికి ముందుగా 18 వేల నిర్వాసిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు. గత ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్‌ పనులను విస్మరించిందన్నారు.

కేంద్ర ప్రభుత్వ బృందం 10 రోజుల క్రితం పోలవరం పనులపై సంతృప్తి వ్యక్తం చేసి అనుకున్న సమయంలో అధికారులు పనులు పూర్తి చేస్తారనే విషయంపై నివేదిక విడుదల చేసిందని మంత్రి అనిల్‌ తెలిపారు. నవంబర్‌ 1న పనులు ప్రారంభించామని, స్పిల్‌వే పనులు జరుగుతున్నాయన్నారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు 35 మీటర్ల ఎత్తులో జరుగుతున్నాయని, స్పిల్‌ చానల్‌లో నిలిచిపోయిన వరదనీటిని గోదావరి నదిలోకి మళ్లిస్తున్నారన్నారు.

ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను కేంద్రం, నాబార్డు విడుదల చేస్తుందని, ఇప్పటికే రూ.1,800 కోట్లు విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వం రూ.55 వేల కోట్లు ప్రాజెక్టు పనులకు రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ముఖ్యమంత్రి అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. పోలవరం నిర్వాసితుల నుంచి 10 వేల వినతులు అందాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

>
మరిన్ని వార్తలు