సేవలకు సలాం..

8 May, 2020 04:01 IST|Sakshi

విశాఖ దుర్ఘటనలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

ప్రాణాలకు తెగించి ప్రజల్ని కాపాడిన ఏపీ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన స్థానికులు

విశాఖ సిటీ, బీచ్‌ రోడ్డు, సాక్షి, అమరావతి: విశాఖలో విష వాయువు లీకేజీ ఘటనపై పోలీసు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రాణాలకు తెగించి విశేష సేవలందించాయి. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు అక్కడకు చేరుకోవడం, ఉన్నతాధికారులు సైతం వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అధికార యంత్రాంగం సకాలంలో రంగంలోకి దిగడంతో ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. జీవీఎంసీ కమిషనర్‌ సృజన ఆధ్వర్యంలో సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులను చురుగ్గా నిర్వహిం చారు. గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లారు. నీటిట్యాంకర్లతో గ్రామాల్లో నీటిని స్ప్రే చేయించారు. (విషవాయువు పీల్చి 10 మంది మృతి)

ఒక్క ఫోన్‌ కాల్‌ కాపాడింది 
► విషవాయువు వ్యాప్తి చెందిన సమయంలో స్థానికుడు ఒకరు సత్వరం స్పందించి డయల్‌ 100కు చేసిన ఒక్క ఫోన్‌ పెను ముప్పు నుంచి ప్రజలను కాపాడింది. తెల్లవారు జామున 3.25కి గ్యాస్‌ లీకైనట్టు స్థానికుడు అరుణ్‌కుమార్‌ డయల్‌ 100కి సమాచారమందించారు. పోలీసులు అదే వేగంతో స్పందించారు. 
► 3.26కి ఎస్‌ఐ సత్యనారాయణతోపాటు నలుగురు కానిస్టేబుళ్లు ఆర్‌ఆర్‌ వెంకటాపురానికి రక్షక్‌ వాహనంలో బయలుదేరి 3.40కల్లా చేరుకున్నారు. వెంటనే మర్రిపాలెం పోలీస్‌స్టేషన్‌కు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. 
► 3.40కి కంచరపాలెం సీఐ, ఆర్‌ఐ భగవాన్, గాజువాక ఎస్సై గణేష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ఇళ్లలో నిద్రిస్తున్న వారిని అప్రమత్తం చేశారు. సమీప ప్రాంతాల్లోని 4,500 కుటుంబాలను ఖాళీ చేయించారు.  
► 3.45కి అగ్నిమాపక విభాగం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.
► 3.45 – 4 గంటల మధ్య 12 రక్షక్‌ వాహనాలు, 108 వాహనాలు 15, అంబులెన్సులు 12, నాలుగు హైవే పెట్రోలింగ్‌ వాహనాలు çఘటన స్థలానికి చేరుకుని బాధితులను హుటాహుటిన తరలించాయి. మినీ బస్సులను సైతం ఏర్పాటు చేసి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 
► 4.30 గంటలకు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా, డీసీపీ జోన్‌–2 ఉదయ్‌భాస్కర్‌లు అక్కడకు చేరుకుని తరలింపు ఆపరేషన్‌లో  పాలుపంచుకున్నారు.  
► 7 గంటలకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు çఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉదయం 8కి లీకేజీని అదుపులోకి తెచ్చారు. 
► ప్రజలను కాపాడే క్రమంలో విశాఖ డీసీపీ–2 ఉదయ్‌భాస్కర్‌తోపాటు మరో 20 మంది పోలీస్‌ సిబ్బంది విషవాయువు పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. 
► వందలమందిని రక్షించిన పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్‌లో అభినందించారు. 

విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురైన ట్రాఫిక్‌ ఎస్‌ఐ వెంకటరావు

బాధితులు ఏమన్నారంటే..
విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నం సమీపంలో ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో గురువారం తెల్లవారుజామున విష రసాయనం వెలువడటంతో ప్రజలు భీతిల్లిపోయారు.  ఒళ్లంతా మంటలు.. దద్దుర్లు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రజలంతా ఉన్నఫళంగా బయటకు పరుగెత్తారు. వాహనాలు ఉన్నవారు ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడ నుంచి దూరంగా తమ బంధువులు, తెలిసినవారి ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డ బాధితులు ఏం చెబుతున్నారంటే..

స్పృహ కోల్పోయిన ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ కానిస్టేబుల్‌

ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం 
నేను.. ముగ్గురు పిల్లలు, నా చెల్లెలు జయలక్ష్మితో కలిసి బీసీ కాలనీలో నివసిస్తున్నాను. విష వాయువు నుంచి తప్పించుకోవడానికి తెల్లవారుజామున నాలుగు గంటలకి ఊరు విడిచి చీమాలపల్లి వైపు ఆరు కిలోమీటర్లు పరుగెత్తాం. నా చెల్లెలు మాత్రం వాం తులు, వికారంతో స్పృహ తప్పిపోయింది. దీంతో అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలిం చాం. ప్రస్తుతం స్పృహలోకి వచ్చింది. ప్రా ణాలతో బయటపడతామని అనుకోలేదు.  
– బిల్ల సూర్య దేముడు, బీసీ కాలనీ, విశాఖపట్నం

నా కూతుళ్లు నిద్ర లేపారు 
మేము పాలిమర్స్‌ కంపె నీకి సమీపంలోనే నివాసం ఉంటున్నాం. ఉదయం నాలుగు గంటల సమయంలో నా కూతుళ్లు నిద్ర లేపారు. కంపెనీలో ఏదో ప్రమాదం జరిగిందని, అందరినీ వెళ్లిపోమంటున్నారని చెప్పారు. అప్పటికే తీవ్రమైన, భరించలేని వాసన వస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తొలుత చీమలాపల్లి వైపు పరు గులు తీశాం. ఆ తర్వాత మమ్మల్ని సింహాచలం వైపు వెళ్లమనడంతో అటు వెళ్లాం. 
– నీలాపు తాతారావు, వెంకటాపురం

అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న స్థానికులు

ఊపిరి తీసుకోలేకపోయా 
పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిందని నన్ను చుట్టుపక్కల వాళ్లు నిద్రలేపారు. అప్పటికే తీవ్రమైన వాసన వస్తోంది. ఊపిరి తీసుకోలేకపోయా. మా ఆయనకు ఆస్తమా ఉండటంతో ఏమవుతుందోనని భయపడ్డా. కొంచెం ఆలస్యమైతే మా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించేది. ఇంటి నుంచి ఆగమేఘాలపై సింహాచలం వైపు పరుగులు తీశాం. 
– గుడివాడ కృష్ణవేణి, వెంకటాపురం

ఉన్నఫళంగా వచ్చేశాం   
పాలిమర్స్‌ కంపెనీ పక్కనే ఉంటున్నాం. వేకువజామున కేకలు వినిపించడంతో నిద్రలేశాం. గ్యాస్‌లీక్‌ అయిందని అందరూ పరు గులు పెడుతున్నారు. మా ప్రాణాలు కాపా డుకోవడానికి ఉన్నఫళంగా పిల్లలను తీసుకుని.. ముడసర్లోవ పార్కుకు వచ్చేశాం.
–ఎస్‌.కనక, వెంకటాపురం

పోలీసులు వచ్చి తలుపుకొట్టారు  
వేకువజామున 5 గంటల సమయంలో పోలీసులు ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. మేము నిద్రలేచి బయటకు వచ్చాం. విషయం చెప్పి బయటకు వెళ్లిపోమన్నారు. వెంటనే ఆటోలో ముడసర్లోవకు వచ్చేశాం.   
– ఎ.పరదేశమ్మ, వెంకటాపురం

ప్రాణభయంతో బయటకు వచ్చేశాం 
నాకు ఈ మధ్యే ఆపరేషన్‌ జరిగింది. నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను. గ్యాస్‌ లీక్‌ సంఘటన తెలియగానే ప్రాణ భయంతో అందరం ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వీల్‌చైర్‌లో ఉన్న నన్ను మా కుటుంబ సభ్యులు ఆటో ఎక్కించి ముడసర్లోవకు తీసుకొచ్చారు.
– ముఖేష్, వెంకటాపురం

మరిన్ని వార్తలు