‘పచ్చ’నోట్లకు పహారా!

7 Apr, 2019 11:38 IST|Sakshi

సాక్షి, తిరుపతి: జిల్లా వాసులంతా ఉగాది పండుగ వేడుకల్లో ఉండగా టీడీపీ నాయకులు మాత్రం  డబ్బు మూటలు తరలించడంలో తలమునకలయ్యారు. నియోజకవర్గాల్లోని ఓటర్లను ప్రలోభపెట్టేందుకు శనివారం పెద్ద ఎత్తున నగదును ఆయా స్థానాలకు చేరవేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే జిల్లాలోని కొందరు పోలీసులు, అధికారులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తూ నగదు తరలింపునకు ఎస్కార్టులా వ్యవహరించారు. తనిఖీల్లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన డబ్బు మూటలను సైతం వదిలేశారు.

అవసరమైన చోటుకు అధికార పార్టీకి చెందిన నగదు అందేలా మరీ పహారా కాస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.  
 టీడీపీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు  డబ్బుల మూటలు అధికారుల కనుసన్నల్లో క్షేమంగా గమ్యస్థానం చేరుతున్నాయి. అవసరమైతే కొందరు అధికారులు ఎస్కార్ట్‌గా వెళ్లి వారు కోరిన చోటుకు నగదును చేర్చి వస్తున్నట్లు తెలుస్తోంది. పచ్చ నేతలకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారుల తీరు చూసి నిజాయితీగా పనిచేసే అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో ఓటర్ల కోసం ఆ పార్టీ నాయకులు చెన్నై, బెంగళూరు నుంచి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు పెద్ద ఎత్తున నగదును చేరవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరూ ఉగాది సంబరాల్లో నిమగ్నమై ఉండడంతో టీడీపీ నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భారీ ఎత్తున వచ్చిన డబ్బుల మూటలను ఎక్సైజ్‌ అధికారులు ఎస్కార్ట్‌ ఇచ్చి కుప్పానికి చేర్చినట్లు విశ్వసనీయ సమాచారం.

మాజీ మంత్రి ఒకరు నగరి నియోజక వర్గంలోని టీడీపీ నాయకుని నివాసానికి రూ.1.75 కోట్లు చేరవేసినట్లు తెలిసింది. ఈ డబ్బును ఓ వాహనంలో కరకంబాడి మార్గం నుంచి పుత్తూరు వైపు తీసుకెళ్తుండగా వడమాలపేట చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేసినట్లు సమాచారం. ఆ వాహనంలో డబ్బులు గుర్తించిన పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని వాహన డ్రైవర్‌ మాజీ మంత్రికి సమాచారం ఇచ్చారు. ఆ మాజీ మంత్రి వెంటనే జిల్లాలోని ఓ అధికారికి ఫోన్‌ చేశారు. ఆ వెంటనే ఆ డబ్బును పోలీసులు తిరిగి ఇచ్చి క్షేమంగా పుత్తూరుకు చేరవేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ట్రాన్స్‌కో వాహనాల్లో చంద్రగిరికి..
చంద్రగిరిలో ఓటర్లను కొనుగోలు చేసేందుకు టీడీపీ శ్రేణులకు చెన్నై నుంచి తిరుపతికి డబ్బును చేరవేసినట్లు తెలిసింది. ఈ డబ్బు తిరుపతిలో పసుపర్తి సూపర్‌ మార్కెట్‌ ఎదురుగా ఓ నివాసంలో భద్రపరిచారు. అటు పక్కనే మరో నివాసంలో ఓ మహిళ వద్ద రూ.5 కోట్లు ఉంచినట్లు సమాచారం. ఈ డబ్బును ప్రతి రోజూ ట్రాన్స్‌కో వాహనంలో చంద్రగిరి నియోజక వర్గంలోని గ్రామాలకు చేరవేస్తున్నట్లు తెలిసింది. అన్నమయ్య సర్కిల్‌ పరిధిలో ఉన్న ట్రాన్స్‌కో అధికారి టీడీపీ నేతలు చెప్పినట్లు ఈ డబ్బును తీసుకెళ్లి చేర్చుతున్నారు.

ప్రైవేటు ఫ్యాక్టరీల నుంచి వసూళ్లు
రేణిగుంట పరిధిలోని ఎస్టేట్‌ వద్ద ఉన్న వివిధ పరిశ్రమలు, గాజులమండ్యం పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసం ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలా వసూలు చేసిన నగదును శ్రీకాళహస్తి, చంద్రగిరి, పలమనేరు ఎన్నికల ఖర్చుకోసం వినియోగిస్తున్నట్లు ఓ ఫ్యాక్టరీ యజమాని వెల్లడించారు.

ఈ నగదును కూడా అధికారుల రక్షణలో గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసినా, డబ్బులు తరలి వెళ్తోందని సమాచారం ఇచ్చినా కొందరు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు