అడ్డుకుంటే అంతు చూస్తాం

11 Jan, 2019 12:53 IST|Sakshi
పూడూరు గ్రామస్తులపై విరుచుకుపడుతున్న తాలూకా ఎస్‌ఐ శ్రీనివాసులు

పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులను బెదిరించిన పోలీస్, రెవెన్యూ అధికారులు

కేసులు పెడతామని, పథకాలు తొలగిస్తామంటూ హెచ్చరికలు

ప్రజలతో పాటు మీడియాపైనాచిందులేసిన తాలూకా ఎస్‌ఐ

బలవంతంగా జన్మభూమి సభల నిర్వహణ

దరిదాపులకు రాని గ్రామస్తులు  

కర్నూలు సీక్యాంప్‌: రోడ్డు సమస్యను పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన కర్నూలు మండలం పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులపై పోలీస్, రెవెన్యూ అధికారులు శివాలెత్తారు. జన్మభూమి సభలను అడ్డుకుంటే అంతు చూస్తామని, కేసుల నమోదుతో పాటు ప్రభుత్వ పథకాలను సైతం తొలగిస్తామంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా గ్రామాల్లోకి ప్రవేశించి సభలు నిర్వహించారు. అయితే..అటువైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదు. పడిదెంపాడు, పూడూరు గ్రామస్తులు  దశాబ్ద కాలంగా రోడ్డు సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతమున్న రోడ్డు ప్రయాణాలకు ఏమాత్రమూఅనువుగా లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో ఆసుపత్రులకు వెళ్లలేక 20 మందికి పైగా చనిపోయారు. రోడ్డు బాగు చేయాలంటూ కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులను, అధికారులను కోరుతున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదు.

దీంతో గత జన్మభూమిలో భారీఎత్తున నిరసనలు తెలియజేశారు. రోడ్డు నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని  కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే..ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో ఆరోవిడత జన్మభూమిని  కూడా బహిష్కరించడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఈ రెండు గ్రామాల్లో శుక్రవారం సభలు ఏర్పాటు చేయగా..అధికారులెవరూ రాకుండా ముందుగా పడిదెంపాడు ఊరిబయటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి ఆందోళన చేపట్టారు. తాలూకా సీఐ వెంకటరమణ వచ్చి గ్రామస్తులను భయాందోళనకు గురిచేశారు. సమస్య చెప్పిన వారితో పాటు వాహనాల వీడియోలు, ఫొటోలు తీసుకుని.. కేసులు పెడతామంటూ బెదిరించారు. దీంతో గ్రామస్తులు వెనక్కి తగ్గగా..అధికారులు ఊళ్లోకి వెళ్లి సభ నిర్వహించారు.  గ్రామస్తులెవరూ సభకు రాలేదు. ఆ తర్వాత పూడూరులో సభ నిర్వహణకు వెళ్లిన అధికారులకు ఊరిబయటే ప్రతిఘటన ఎదురైంది. గ్రామస్తులు టైర్లు అంటించి, ఆటోలు, ఇతర వాహనాలు అడ్డంపెట్టి ఆందోళన చేపట్టారు.  ఇక్కడ తాలూకా ఎస్‌ఐ శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి రెచ్చిపోయారు. గ్రామస్తులను తోసివేశారు. అడ్డుకునేవారిని వాహనాలతో తొక్కిస్తానంటూ బెదిరించారు. అక్కడే ఉన్న జర్నలిస్టులపైనా చిందులు వేశారు. ఈ దృశ్యాలను కొందరు కెమెరాలు, సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండగా వాటిని లాక్కున్నారు. అధికారులు బలవంతంగా గ్రామంలోకి వెళ్లి జన్మభూమి సభ నిర్వహించగా.. ఇక్కడ కూడా గ్రామస్తుల నుంచి చుక్కెదురైంది. 

మరిన్ని వార్తలు