విద్యుత్‌ కార్మికులపై ఉక్కుపాదం

6 Mar, 2019 07:35 IST|Sakshi

‘చలో అమరావతి’ భగ్నం

అరెస్టు చేసి పలు పోలీస్‌ స్టేషన్లకు తరలింపు

ప్రభుత్వానికి పతనం తప్పదని  జేఏసీ నేతల హెచ్చరిక

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ‘చలో అమరావతి’ కార్యక్రమం చేపట్టిన విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.   విద్యుత్‌శాఖలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుల రెగ్యులరైజ్, పీస్‌ రేట్‌ రద్దు, విద్యుత్‌సంస్థలో  కార్మికులను విలీనం చేయాలనే తదితర ప్రధాన డిమాండ్లతో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చలో అమరావతి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు. తొలుత ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లకు పైబడి విద్యుత్‌ సంస్థలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా మగ్గుతున్నామని, తమ బాధలు ఆలకించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ధర్నా చౌక్‌ వద్దకు ప్రభుత్వ ప్రతినిధులు గానీ, యాజమాన్యం గానీ వచ్చి డిమాండ్లు పరిష్కరిస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.

నాలుగున్నరేళ్లుగా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని కార్మికులు మండిపడ్డారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకుండా చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు ధర్నాచౌక్‌ నుంచి అమరావతి వెళ్లేందుకు రోడ్డెక్కారు. భారీగా మోహరించిన పోలీసులు విద్యుత్‌  కాంట్రాక్ట్‌ కార్మికుల చర్యను అడ్డుకున్నారు. వారిని రోడ్లపై పడేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో విసిరేశారు. ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన దూరప్రాంతాల వారిని సైతం వెంటపడి లాక్కొచ్చి వాహనాల్లోకి ఎక్కించారు. ఆ సమయంలో పోలీసులు, కార్మికుల మధ్య వాగ్వాదం జరిగింది. కార్మికులు చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికులను అరెస్టు చేసి ఉయ్యూరు, పమిడిముక్కల, నున్న పోలీస్‌స్టేషన్లకు తరలించారు. కాంట్రాక్ట్‌ కార్మికుల ఐక్యవేదిక చైర్మన్‌ బాలకాశి మాట్లాడుతూ ప్రభుత్వం  దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ పెద్దలు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే పోలీసులతో అరెస్టు చేయించారని,  వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జేఏసీ చైర్మన్‌ ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆందోళన చేస్తున్న కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఐక్యవేదిక వైస్‌ చైర్మన్‌ స్వతంత్రకుమార్, సెక్రటరీ జనరల్‌ మల్లికార్జునరెడ్డి, కన్వీనర్‌ వి.గంగయ్య, కట్టా నాగరాజు, కె.నారాయణరెడ్డి, 13 జిల్లాల కార్మికులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు