హనీట్రాప్ కేసు : కీలక వ్యక్తి అరెస్ట్‌

6 Jun, 2020 20:11 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. విశాఖపట్నం గూడచర్యం కేసులో ఉగ్రవాదులకి నిధులు సమకూర్చిన మరో కుట్రదారుడు అబ్దుల్ రెహమాన్ జబ్బార్ షేక్‌ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో అబ్దుల్‌ రెహమాన్‌ భార్య షయిత్సా కాజిర్‌ను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. విశాఖ నౌకాదళం కేంద్రంగా సాగిన హనీట్రాప్ వ్యవహారం గత ఏడాది డిసెంబర్ 20న బయటపడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు ఎరవేసి విశాఖ నేవీ అధికారుల ద్వారా రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేసేందుకు కుట్ర పన్నింది. (నిజాలు నిగ్గు తేల్చేందుకు ఎన్‌ఐఏ!)

కుట్రని పసిగట్టిన ఎన్‌ఐఏ ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరుతో లోతుగా దర్యాప్తు చేపట్టింది. విచారణలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 29న విజయవాడ పోలీస్ స్టేషన్‌లో ఐసీపీ సెక్షన్ 120 బి, 121ఎ, యుపీ (ఏ) చట్టం సెక్షన్ 17,18, అధికారిక రహస్యాల చట్టంలోని సెక్షన్ 3 క్రింద అధికారులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ నెలలోనే 11 మంది నేవీ అధికారులతో సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా మరొక సూత్రధారి అరెస్ట్ చేసి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ద్వారానే నేవీ అధికారులకి డబ్బులు అందినట్లు ఎన్‌ఐఏ నిర్దారణ చేసింది.

మరిన్ని వార్తలు